కరోనా నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేందుకు ఆర్‌బీఐ విధించిన మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం తన స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు వారం రోజులు గడువు విధించింది.
విపత్తు నిర్వహణ చట్టం ద్వారా.. అవసరమైన అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించడంలేదని జస్టిస్ ఆశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో ఆర్‌బీఐ పేరు చెప్పి కేంద్రం తప్పించుకుంటోందని అసహనం వ్యక్తంచేసింది.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేంద్రం నిర్ణయాన్ని చెప్పేందుకు మరో వారం రోజులు గడువు కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది.
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ప్రస్తుత మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగుస్తుందని.. దానిని ఇంకొన్నాళ్లు పొడగించాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ విషయంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.
కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాలపై ఆరు నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా విక్రయానికి మళ్లీ గడువు పెంపు