కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అనూహ్య నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంకు. కీలక వడ్డీ రేటును ఒకేసారి 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. రివర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్ల క్షీణతతో 4 శాతానికి చేరింది.
కరోనా విజృంభణ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ వంటి పరిస్థితుల మధ్య ఈ అసాధారణ నిర్ణయాలను ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు. రెపో రేటు తగ్గింపు సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్.