ఇటీవల కాలంలో బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ పథకాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనూ వడ్డీ రేట్లు ఎంతో తగ్గాయి. అయితే, గత కొంతకాలంగా వీటిపైన వడ్డీ రేట్లు ప్రభుత్వం తగ్గించలేదు. దీన్ని ఈసారీ కొనసాగిస్తూ.. 2021 డిసెంబరు 31 వరకూ పాత వడ్డీ రేట్లే అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. గత ఆరు త్రైమాసికాలుగా ఈ రేట్లను తగ్గించకపోవడం గమనార్హం.
దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పైన 7.1శాతం రాబడి వస్తుండగా.. 10 ఏళ్ల లోపు అమ్మాయిల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం 'సుకన్య సమృద్ధి యోజన'లో 7.6 శాతం వార్షిక రాబడి అందుతోంది.
రెండు వారాల్లో ఆర్‌బీఐ పరపతి సమీక్ష ఉన్న నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గకపోవడం చిన్న మదుపరులకు ఊరటగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు సవరించకపోతే.. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గవు. ఇది చాలామందికి ప్రయోజనం కలిగించేదే.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..