ఉల్లి మళ్లీ కొండెక్కింది. కొన్నిచోట్ల కిలో రూ.100 వరకు పలుకుతోంది. అసలే కరోనా కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్యుడికి పండుగ సీజన్లో చుక్కలు చూపిస్తోంది. ఎందుకిలా? ఏటా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నా... సమస్యకు ఎందుకు పరిష్కారం లభించడం లేదు? మరి ఇలా ధరలు పెరిగితే లాభపడుతున్నదెవరు?
ధరల పెరుగుదలకు కారణాలు..
ఉల్లి ఎక్కువగా పండే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి వరదల కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇదే అదునుగా గిడ్డంగుల్లో ఉన్న పరిమిత ఉల్లి నిల్వ ధరలను దళారీలు ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి.
ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం.. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం, దిగుమతులు పెంచడం వంటి చర్యల చేపట్టడం వల్ల నామమాత్రపు ఉపశమనం మాత్రమే లభించిందని వినియోదాగులు అంటున్నారు.
ఎవరూ సంతోషంగా లేరు..
మార్కెట్లో ఉల్లి భారీ ధర పలుకుతున్నా... పండించిన రైతులు దక్కేది అంతంతే. నిత్యావసరాల చట్టంలో మార్పుల కారణంగా వ్యవసాయ మండీల్లో ఉల్లి విక్రయాలకూ ఇబ్బంది ఏర్పడుతోంది. ఫలితంగా వ్యాపారులూ సంతోషంగా లేరు. కొనుగోలుదారుల సంగతి సరేసరి.
ఉల్లి శక్తికి రాజకీయ సంక్షోభం..
రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి కూడా ఉల్లిపాయలకు ఉంది. చాలా సార్లు ఎన్నికల్లో ఉల్లి కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి.
ఉదాహరణకు.. దివంగత నేత సుష్మాస్వరాజ్ నేతృత్వంలో దిల్లీలో చక్రం తిప్పిన భాజపా.. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. పెరిగిన ఉల్లి ధరలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం అప్పట్లో ఆ పార్టీ ఓటమికి కారణమైంది. హాస్యాస్పదమనిపించినా మళ్లీ ఇప్పటి వరకు భాజపా దిల్లీలో అధికారం దక్కించుకోలేకపోయింది.
నిల్వ సమస్య..
ఉల్లి లాంటి త్వరగా పాడయ్యే నిత్యావసరాలను ఏడాది పొడవునా సరసమైన ధరల్లో లభించేలా చూడాలంటే.. వాటిని నిల్వ చేయడం పెద్ద సమస్య. దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు భవిష్యత్ అవసరాలకు తగ్గ పాఠాలను మన ప్రభుత్వాలు నెర్చుకోలేదు.
రైతులకు అమ్మకాల విషయంలో రక్షణ కల్పించేందుకు 'ఆపరేషన్ గ్రీన్స్' పథకాన్ని మొదలు పెట్టినప్పటికీ.. అది ఆశించినంతగా ఫలితాలను ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఏం చేస్తే మేలు?
ఉల్లిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దాని నిల్వ చేయడంలో స్థిరమైన.. అధునాతన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిల్వ చేసే సామర్థ్యాలు పెరిగితే ధరల నియంత్రణ సులభమవుతుందని చెబుతున్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఉల్లి నిల్వపై ప్రభుత్వానికి 2019లోనే పలు సూచనలు చేసింది. ఇజ్రాయెల్, బ్రెజిల్లో ప్రస్తుతం వాడుతున్న ఉల్లి గిడ్డంగుల వ్యవస్థలను పరిశీలంచాలని సలహా ఇచ్చింది.
ఇజ్రాయెల్లో ఓపెన్ వెంటిలేటెడ్ గిడ్డంగుల్లో ఉల్లిని నిల్వ చేస్తుంటారు. ఈ గిడ్డంగుల్లో పెద్ద పెద్ద బాక్సుల్లో నిల్వ చేసి గాలి తగిలేలా ఉంచడం వల్ల.. ఉల్లి ఎక్కవ రోజులు పాడవ్వకుండా ఉంటుంది. బ్రెజిల్లో వ్యవసాయ క్షేత్రాల్లోనే.. తక్కువ ఖర్చుతో కూడుకున్న సీలో వ్యవస్థను ఉల్లి నిల్వకు ఉపయోగిస్తుంటారు.
ఇదీ చూడండి:పెట్టుబడులను ఆకట్టుకునే వ్యూహం?