అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు.. భారత కరెన్సీ, రుణ రేటింగ్‌ను తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలు అంత సమర్థంగా లేవని.. వీటి ద్వారా తెలుస్తుందని విమర్శించారు. పేదలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈలకు) ప్రోత్సాహం ఇవ్వడంలో మోదీ విఫమవ్వడం వల్ల పరిస్థితులు మరింత దయనీయంగా మారొచ్చని పేర్కొన్నారు.
మూడీస్ రేటింగ్ తగ్గింపు ఇలా..
భారత కరెన్సీ రేటింగ్‌ను దిగువకు సవరిస్తూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇటీవల నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో విదేశీ, దేశీయ దీర్ఘకాలిక కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏఏ2 నుంచి బీఏఏ 3కి తగ్గించింది. దేశీయ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్‌నూ బీఏఏ2 నుంచి బీఏఏ3కి కుదించింది.
ఇదే సమయంలో దేశ స్వల్పకాలిక కరెన్సీ రేటింగ్‌ను పీ-2 నుంచి పీ-3కి సవరించింది. భారత్‌పై భవిష్యత్ అంచనాలను ఇంకా ప్రతికూలంగానే ఉంచుతున్నట్లు నివేదికలో పేర్కొంది మూడీస్.
రుణ రేటింగ్ కూడా..
అలాగే భారత సార్వభౌమ రుణ రేటింగ్‌ను కూడా తగ్గించింది మూడీస్. ప్రస్తుతమున్న రుణ రేటింగ్ బీఏఏ2ను బీఏఏ3కి తగ్గించింది. గడిచిన 20 ఏళ్లలో ఇలా రుణ రేటింగ్ తగ్గించడం ఇదే ప్రథమం.
తక్కువ వృద్ధి, ఆర్థిక స్థితిగతుల క్షీణత వల్ల ఆర్థిక రంగ ఒత్తిడిని తగ్గించడానికి విధాన రూపకర్తలు సవాళ్లు ఎదుర్కోక తప్పదని మూడీస్ అభిప్రాయపడింది.