దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎవరికైనా కరోనా సోకి వైద్యం చేయించుకోవాలంటే ఖర్చులు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స ఇస్తున్నా.. సామర్థ్యానికి మించి రోగులు వస్తున్న కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులవైపు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైద్యం పేరుతో భారం తగ్గించేందుకు కొవిడ్-19 ప్రామాణిక బీమా తీసుకురావాలని.. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఇటీవల జనరల్, ఆరోగ్య బీమా కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రామాణిక బీమాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయా సంస్థలు. జులై 15 నుంచి వీటిని విక్రయించనున్నాయి.
అయితే ఇప్పటికే కరోనాకు సంబంధించి కొన్ని బీమాలు అందుబాటులో ఉన్నాయి. మరి వాటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికి ఏ బీమా సరిపోతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
స్వల్ప కాల బీమా..
స్వల్ప కాలానికి సంబంధించి బీమా తదితర సదుపాయాలు అందించేందుకు జీవిత బీమా సంస్థలకు కూడా అనుమతులు మంజూరు చేసింది ఐఆర్‌డీఏఐ. ఇవి ఆరోగ్య బీమా పాలసీలు అయినా కరోనా వైద్యానికి కూడా కవరేజ్ ఇస్తాయి. అయితే ఇవి పూర్తి మొత్తాన్ని కవరేజ్ ఇవ్వట్లేదు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. వ్యాధి సోకిన వారు రూ.50వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని బీమా రంగ నిపుణులు అంటున్నారు.
నిర్ణీత మొత్తానికే బీమా..
కొవిడ్-19కు సంబంధించిన పాలసీలు ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీల్లో బీమా చేయించుకున్న నిర్ణీత మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి.
ఆరోగ్య బీమా విషయంలో రూమ్ ఛార్జీలు, వైద్యేతర ఖర్చులు తదితర కొన్ని ఛార్జీలను డిడక్షన్లుగా పరిగణిస్తారు. కొవిడ్ విషయంలో అవి ఎక్కువగా ఉంటున్నాయి.
పేషెంట్ దగ్గరే ఉండే మెడికల్ ఆఫీసర్, నర్సింగ్, హైజీన్ తదితరాలకు ఖర్చు ఎక్కువే ఉంటోంది. సాధారణంగా వీటన్నింటిని బీమా కంపెనీలు రూమ్ ఛార్జీల కింద పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి ఆరోగ్య బీమా పాలసీలో వీటికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని బీమా కంపెనీలు అందించటం లేదు. కొవిడ్ విషయంలో ప్రత్యేకంగా రోగి ఉండే గదికి సంబంధించిన బిల్లు సాధారణ గది ఛార్జీల లిమిట్ కంటే ఎక్కువ ఉంటున్నాయి.
యాడ్‌తో మేలు..
ఆరోగ్య బీమాలో వైద్యేతర ఖర్చులకు 3 నుంచి 5 శాతం పరిమితి ఉంటుంది. కొవిడ్‌కు సంబంధించి పీపీఈ కిట్లు, ఇతర వైద్యేతర ఖర్చులకు 10-25 శాతం ఉంటున్నాయి. వీటిని కూడా బీమా సంస్థలు పూర్తిగా చెల్లించటం లేదు. వీటన్నింటి దృష్ట్యా నిర్ణీత ప్రయోజనం కలిగి బీమా లేదా యాడ్-ఆన్ ద్వారా ఈ డిడక్షన్లకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. వీటి విషయంలో రెండు లక్షల వరకు బీమా తీసుకోవచ్చని వారు చెబుతున్నారు.
బీమా లేని వారికి అవసరం
ఆరోగ్య బీమా పాలసీ లేని వారు కొవిడ్-19కు ప్రత్యేకించి పాలసీ తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పాలసీ కవరేజ్ సరిపోదని భావించే వారికి కూడా ఇది ముఖ్యమేనని వారు అంటున్నారు. కొవిడ్ చికిత్సకు సంబంధించి హాస్పిటలైజేషన్ ఖర్చులు.. మిగతా వాటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనితో సరిపడా మొత్తం కవరేజ్ అందటం ముఖ్యం.
ఉద్యోగులు కేవలం కంపెనీలు ఇచ్చే బీమాపైనే ఆధారపడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో తక్కువ మొత్తం మాత్రమే కవరేజి ఉండే అవకాశాలున్నాయని వారు అంటున్నారు. తక్కువ కవరేజ్ ఉన్న వారు కూడా తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 10 లక్షల కంటే ఎక్కువ బీమా ఉండాలని వారు చెబుతున్నారు.
వాటికి హామీ లేదు..
వేరే వ్యాధుల్లా కాకుండా.. కొవిడ్- 19కు చికిత్సలో కొన్ని ప్రత్యేక విధివిధానాలు ఉన్నాయి. గ్లౌజులు, బ్యాండేజీ తదితర ఖర్చులు… ఆరోగ్య బీమా పాలసీల్లో మినహాయింపు ఉంటుంది. ప్రత్యేకంగా కొవిడ్-19 పాలసీ తీసుకున్నట్లైతే.. వీటి ఖర్చును బీమా కంపెనీలే భరిస్తాయి. అంతే కాకుండా కొవిడ్-19 చికిత్సలో భాగంగా హోం క్వారంటైన్, ప్రత్యేకమైన క్వారంటైన్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ఖర్చులను భరించే హామీలు.. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాల్లో లేవు.
స్వల్పకాలిక అవసరం మాత్రమే..
ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రామాణిక బీమా స్వల్పకాలిక అవసరం మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో చికిత్సకు సంబంధించి విధివిధానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి కొవిడ్ చికిత్సలో భాగంగా ప్రత్యేకించి మందులు వాడటం కంటే.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్-19 ప్రత్యేక పాలసీ ప్రాముఖ్యత వ్యాక్సిన్ రావటం లేదా ఇప్పటికే ఉన్న మందులు సరిగ్గా పనిచేయటం లాంటి పరిణామాల వల్ల తగ్గిపోతుంది.
ఇదీ చూడండి:భారత్‌లో 51 శాతం తగ్గిన ఉద్యోగ నియామకాలు