కొవిడ్ సంక్షోభం వల్ల ఆదాయాలు కోల్పోయిన వారికి కల్పించిన రుణ వాయిదాల (ఈఎంఐలు) మారటోరియం ఎలా అమలు జరుగుతుందనే విషయమై ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఉన్న రుణ బకాయిలను లెక్కలోకి తీసుకోబోతున్నట్లు బుధవారం స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం అమలైంది.
మారటోరియం వినియోగించుకున్న వారికి, రుణ బకాయిలకు సంబంధించి వడ్డీపై వడ్డీ(చక్ర వడ్డీ) పడింది. ఎందుకంటే రుణ మొత్తానికి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ జత చేరుతూ వచ్చింది. ఆ వరుస నెలలకు అధిక అసలుపై మళ్లీ వడ్డీ పడింది. అంటే ఆ మారటోరియం సమయానికి వడ్డీపై వడ్డీ కట్టాల్సి వచ్చింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతీ విదితమే. రుణ గ్రహీతల్లో అర్హత గల వారికందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ తాజాగా స్పష్టం చేసింది. అంటే ఆరు నెలల కాలానికి వారు కట్టిన చక్ర వడ్డీకి, సాధారణ వడ్డీకి మధ్య ఉన్న తేడాను అందరు రుణ స్వీకర్తలకు(రూ.2 కోట్ల రుణాల వరకు) రీఎంబర్స్ చేయనుంది.
ఎవరు అర్హులు?
రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న అందరూ అర్హులే. మారటోరియాన్ని వినియోగించుకున్నా.. పాక్షికంగా వినియోగించుకున్నా.. అసలు తీసుకోకపోయినా చెల్లింపులు వస్తాయి. ఈ ఆరు నెలల కాలంలో మూసివేసిన రుణ ఖాతాలకూ ఇది వర్తిస్తుంది. వీటికి మార్చి 1 నుంచి ఖాతా మూసివేసిన తేదీ వరకు వడ్డీ అంతరాన్ని లెక్కవేస్తారు. వీరికి ఖాతాదారు సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియాను జమ చేస్తారు. అయితే..ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు, షేర్ల తనఖాపై తీసుకున్న రుణాలకు ఈ ఎక్స్‌గ్రేషియా ఊరట ఉండదు. సెక్యూరిటీలపై తీసుకున్న రుణాలూ ఈ అర్హత పొందవు.
ఎప్పటికి అందుతుంది?
నవంబరు 5, 2020 కల్లా అర్హత గల ఖాతాల్లో పరిహార మొత్తాన్ని జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకులను ఇప్పటికే కోరింది. డిసెంబరు 15, 2020 కల్లా బ్యాంకులు రీఎంబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఎలా లెక్కగడతారు?
రూ.2 కోట్ల పరిమితిని లెక్కగట్టడం కోసం ఒక వ్యక్తి తీసుకున్న అన్ని రుణాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.. అంటే అన్ని బ్యాంకుల్లో ఒక వ్యక్తి తీసుకున్న రుణాలను చూస్తారన్నమాట. మొత్తం ఆరు నెలల కాలానికి దీనిని లెక్కగడతారు. మార్చి 1, 2020 నుంచి ఆగస్టు 31, 2020 వరకు మారటోరియం వెసలుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాలానికి బ్యాంకులు విధించిన వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తారు. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం ఈ లెక్కలు ఉంటాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో తీసుకొచ్చిన ఈ మాఫీ పథకం వల్ల ప్రభుత్వంపై రూ.6500 కోట్ల భారం పడుతుంది.
దరఖాస్తు చేయాలా?
వడ్డీపై వడ్డీ మాఫీ కోసం రుణ స్వీకర్తలు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ఖాతాల్లో ఆటోమేటిక్‌గా మొత్తం జమ అవుతుంది.
ఏ రుణాలకు వర్తిస్తుందంటే..?
- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ
- విద్య, గృహ
- మన్నికైన వినియోగ వస్తువులు, వాహన రుణాలు
- క్రెడిట్ కార్డు బకాయిలు
- వినియోగదారు రుణాలు
- వ్యక్తిగత, వృత్తిగత రుణాలు
ఇదీ చూడండి: చక్రవడ్డీ మాఫీపై సందేహాలకు ఆర్థిక శాఖ స్పష్టత