కరోనా నేపథ్యంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ ఆర్థిక శాఖ ఇటీవల ప్రకటన చేసింది. ఈ చక్రవడ్డీ మాఫీ పథకానికి సంబంధించి రుణగ్రహీతల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. తరచూ అడిగిగన ప్రశ్నల (ఎఫ్ఏక్యూ)ను విడుదల చేసింది.
అందులో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటి లోన్ ఔట్స్టాండింగ్ను.. సాధారణ వడ్డీ, వడ్డీపై వడ్డీ మధ్య తేడా నగదును లెక్కించేందుకు రిఫరెన్స్‌గా తీసుకోనున్నట్లు తెలిపింది.
రుణగ్రహీతలు ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండానే మాఫీ అయిన చక్రవడ్డీ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారటోరియం అవకాశాన్ని వినియోగించుకోకుండా.. రుణాల ఈఎంఐలు చెల్లించిన వారికీ చక్రవడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నెల 23న.. మారటోరియం కాలనికి చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
కేంద్రం ప్రకటించిన ఈ పథకాన్ని.. కచ్చితంగా అమలు చేయాలని ఆర్బీఐ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను మంగళవారం ఆదేశించింది. కేంద్రం విధించిన గడువులోపు (నవంబర్ 5 లోపు) బ్యాంకులు రుణ గ్రహీతల ఖాతాల్లో మాఫీ చేసిన చక్రవడ్డీని జమ చేయాలని సూచించింది.