కరోనా వైరస్ దేశంపై ప్రభావం చూపుతున్న వేళ ఆర్థిక రంగానికి ఆనందం కలిగించే ప్రకటన చేసింది జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ). 2020 ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 4.5 శాతం వృద్ధితో ఏడు నెలల గరిష్ఠానికి చేరిందని వెల్లడించింది. మైనింగ్ రంగంలో పెరుగుదల, తయారీ, విద్యుత్తు ఉత్పత్తి ఊపందుకున్న నేపథ్యంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
- 2019 ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 0.2 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది. గత జులైలో 4.9 శాతం పెరిగింది. అనంతరం 4 శాతానికి పెరగడం ఇదే తొలిసారి.
- తయారీ రంగం వృద్ధి ఫిబ్రవరిలో 3.2 శాతంగా ఉన్నట్లు గణాంక కార్యాలయం ప్రకటన చేసిది. గతేడాది ఇదే సమయానికి 0.3 శాతం తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
- విద్యుత్ ఉత్పాదన సుమారు 8.1 శాతం మేర వృద్ధి సాధించింది. 2019 ఫిబ్రవరిలో విద్యుత్తు రంగం ఉత్పాదకత కేవలం 1.3 శాతంగానే వృద్ధి నమోదు చేసింది.
- 2020, ఫిబ్రవరిలో గనుల రంగంలో అత్యధికంగా వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 2.2 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఫిబ్రవరిలో 10 శాతానికి చేరుకుంది.
- 2019ఏప్రిల్-2020 ఫిబ్రవరి మధ్య ఐఐపీ వృద్ధి రేటు సుమారు 0.9 శాతం మేర క్షీణించింది. 2018-19 సమయంలో అది 4 శాతంగా ఉంది.