ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో వృద్ధి రేటుపై సానుకూల అంచనాలతో బుధవారం ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో 2022-23లో భారత వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని వెల్లడించింది.
కొవిడ్ రెండో దశ విజృంభణ ఆర్థిక రికవరీకి ఆటంకంగా మారొచ్చని కూడా పేర్కొంది.
చైనా వృద్ధి రేటు ఇలా..
ఈ ఏడాది చైనా వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదవ్వచ్చని.. 2022లో 5.5 శాతానికి పరిమితమవ్వచ్చని అంచనా వేసింది ఏడీబీ. కరోనా సంక్షోభంలోనూ చైనా గత ఏడాది సానుకూల వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం.
ఆసియా వృద్ధి రేటు అంచనాలు..
దక్షిణాసియా వృద్ధి రేటు ఈ ఏడాది 9.5 శాతానికి పెరగొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2020లో ఈ ప్రాంత జీడీపీ 6 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. 2022లో ఏడాది 6.6 శాతానికి వృద్ది రేటు పరిమితం కావచ్చని తెలిపింది.
ఆసియాలో అభివృద్ధి చెందుతున్న ప్రాంత వృద్ధి రేటును ఈ ఏడాది 7.3 శాతంగా లెక్కగట్టింది ఏడీబీ. ప్రపంచ వృద్ధి రేటు రికవరీ సానుకూలతలు, కొవిడ్ 19 వ్యాక్సిన్ పురోగతి ఇందుకు కారణంగా పేర్కొంది. కరోనా సంక్షోభం వల్ల ఈ ప్రాంత వృద్ధి రేటు గత ఏడాది 0.2 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. 2022లో 5.3 శాతానికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది.
హాంకాంగ్, చైనా, కొరియా, సింగపూర్ వంటి దేశాలను మినహాయించి అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రాంత వృద్ధి రేటు 2021లో 7.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది ఏడీబీ.
ఇదీ చదవండి:కరోనాపై పోరులో భారత్కు ఏడీబీ ఆర్థిక సాయం