ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరంలో పుంజుకునే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పయనిస్తోందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి, కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం, ప్రభుత్వ వ్యయం పెరగడం వంటివి అందుకు దోహదం చేయనున్నాయని పేర్కొంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దన్నుగా నిలుస్తుందని వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థాయిలో పెట్టడానికి ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడింది. దేశంలో ప్రతిఒక్కరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకాలు ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసిరే ప్రమాదం ఉందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త కరోనాపై పనిచేయకపోతే.. క్రమంగా పుంజుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలిదశలోనే తిరోగమన బాటపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం పునరుద్ధరణ బాటలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. కొవిడ్‌కు మునుపటి పరిస్థితులతో పోలిస్తే భారత్ కొంత ఉత్పత్తి సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోనుందని పేర్కొంది. జీడీపీలో 10 శాతానికి సమానమైన తయారీ లోటు దీర్ఘకాలం కొనసాగనుందని తెలిపింది.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దన్నుగా నిలిచాయని ఎస్‌అండ్‌పీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ గాడిలోకి వస్తుందని తెలిపింది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులు ఇప్పటికే చర్యలు చేపట్టాయని పేర్కొంది.
ఇదీ చూడండి: ఆరంభ లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 50 పాయింట్లు డౌన్