దేశంలోని 40 కోట్ల శ్రామిక జనాభా(వర్కింగ్ పాపులేషన్)లో సగం మంది ఇప్పటికే ఏదో రకమైన రుణం (క్రెడిట్ కార్డు కూడా కలుపుకొని) తీసుకొని ఉన్నారని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) నివేదిక తెలిపింది. అలాగే రుణగ్రహీతల్లో సగానికి పైగా ఇప్పటికే ఏదో ఒక బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నవారేనని పేర్కొంది. దీంతో అర్హత కలిగిన వినియోగదారులను చేరుకోవడంలో సంస్థలకు సులభమయ్యిందని అభిప్రాయపడింది.
మరోవైపు సుదీర్ఘకాలంగా అధిక వడ్డీకి రుణాలిచ్చే ప్రైవేటు రుణదాత ఉచ్చులో చిక్కుకుంటున్న ప్రజలను ఆదుకునేందుకు సాధికార సంస్థల ద్వారా ప్రభుత్వం రుణసౌకర్యాన్ని అందుబాటులో ఉంచిందని నివేదిక తెలిపింది. అలాగే, గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ వర్గాలకిచ్చిన రుణాల రికవరీ దెబ్బకొట్టడంతో రుణ సంస్థలు రీటైల్ విభాగంపై దృష్టి సారించాయని పేర్కొంది. ఈ పరిణామాలు కూడా రుణాల మంజూరుకు దోహదం చేసినట్లు తెలిపింది. అయితే, మహమ్మారి ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో వీరి చెల్లింపు సామర్థ్యంపై రుణ సంస్థల్లో అనుమానాలు లేవనెత్తుతున్నట్లు తెలిపింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 18-33 ఏళ్ల మధ్య వయసు గల మరో 40 కోట్ల మందిని చేరుకునేందుకు రుణ సంస్థలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వర్గంలో ఇప్పటి వరకు 8 శాతం మందికి మాత్రమే రుణాలు అందాయని తెలిపింది.
కొత్తగా రుణాలు తీసుకుంటున్న 30 ఏళ్ల లోపు వారిలో అత్యధిక మంది వ్యక్తిగత రుణాలు, వినియోగ వస్తువుల రుణాలవైపే మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ వర్గంలో మహిళల వాటా చాలా తక్కువని తెలిపింది. కొత్తగా రుణం తీసుకుంటున్న వారిలో మహిళ వాటా వాహన రుణాల్లో 15 శాతం, గృహ రుణం 31 శాతం, వ్యక్తిగత రుణం 22 శాతం, వినియోగ వస్తువుల రుణం 25 శాతంగా ఉందని వెల్లడించింది. తమకు తొలిసారి రుణం ఇచ్చిన సంస్థల పట్ల యువత విశ్వసనీయంగా ఉంటున్నట్లు తేలిందని పేర్కొంది.
ఇదీ చూడండి: గూగుల్ పిక్సెల్ 5ఏ రిలీజ్ డేట్ ఫిక్స్!