నీతి ఆయోగ్ 'ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020'లో గుజరాత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు 2,3 స్థానాల్లో ఉన్నట్లు నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
తీరప్రాంతాలు ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020లో తొలి పది ర్యాంకుల్లో ఉండటం గమనార్హం.
తీర ప్రాంతంలేని రాష్ట్రాల్లో..
తీర ప్రాంతాలు లేని రాష్ట్రాల్లో ఎగుమతుల పరంగా.. రాజస్థాన్ ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. తర్వాతి స్థానంలో తెలంగాణ, హరియాణాలు ఉన్నట్లు తెలిపింది. ఛండీగఢ్, ఝార్ఖండ్లు కూడా ఎగుమతుల ప్రోత్సాహానికి అనేక చర్యలు తీసుకున్నట్లు నీతి ఆయోగ్ వివరించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఎగుమతులను పెంచుకునేందుకు.. ఈ రెండు రాష్ట్రాలు పాటించిన విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.
ఆ రాష్ట్రాల్లో..
హిమాలయ రాష్ట్రాల్లో.. ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020లో.. ఉత్తరాఖండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ అగ్రస్థానంలో ఉంది.
దేశ ఎగుమతుల్లో 70శాతం కేవలం ఐదు రాష్ట్రాల నుంచే జరుగుతున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలు ఉన్నట్లు పేర్కొంది.
మరిన్ని విషయాలు..
చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే.. భారత్‌కు పర్ క్యాపిటా ఎగుమతుల వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం భారత తలసరి ఎగుమతుల విలువ 241 డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. చైనా, దక్షిణ కొరియాల తలసరి ఎగుమతుల విలువలు వరుసగా 18,000 డాలర్లు, 11,900 డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను రానున్న సంవత్సరాల్లో రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఆ రెండు టెల్కోలకు 94 లక్షల యూజర్లు గుడ్‌బై