కరోనా చికిత్సకు సంబంధించి అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ ఔషధాలపై పన్నుల తగ్గింపుపై చర్చే ప్రధాన అజెండాగా వస్తు, సేవల పన్ను కమిటీ ఈనెల 12న భేటీ కానుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (జీఓఎం) నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం కౌన్సిల్ భేటీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
గత భేటీలో చర్చాంశాలు..
మే 28న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కరోనాకు చికిత్సకు వాడే సామగ్రి అయిన పీపీఈ కిట్లు, మాస్క్లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని కోరారు. ఈ అంశంపై అధ్యయనానికి కేంద్ర ఆర్థిక శాఖ మేఘాలయ ముఖ్యమంత్రి కె.సంగ్మా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూన్ 7న నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని సిఫార్సుల ఆధారంగా ఈనెల 12న జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి:2021-22 వృద్ధి రేటు 8.5 శాతం!