కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్-ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయని.. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం లక్షా 51 వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై లోక్‌సభలో వచ్చిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అత్యధికంగా... 22 వేల 485 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించనున్నారు. 13 వేల 763 కోట్ల రూపాయలను కర్ణాటకకు ముట్టజెప్పనున్నారు.
కేంద్రం నుంచి పరిహారం తీసుకునే రాష్ట్రాల జాబితాలో ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పెండింగ్‌లో ఉన్న పరిహారం, భవిష్యత్ చర్యల గురించి ఆగస్టు 27న జరిగిన 41వ జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించామన్న ఠాకూర్.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ రుణాలు తీసుకోవడం, జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు 2ఎంపికలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 2 లక్షల 35 వేల కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో 2020-21 సంవత్సరానికి కేంద్రానికి మొత్తం నికర జీఎస్టీ లక్ష్యాన్ని 6 లక్షల 90 వేల 500 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రశ్నకు... కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి:- ఆగస్టులో వెయ్యి కోట్లు తగ్గిన జీఎస్టీ వసూళ్లు
తగ్గిన ఎఫ్డీఐలు...
గత మూడేళ్లుగా చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయని లోక్సభకు తెలియజేశారు అనురాగ్ ఠాకూర్. 2019-20లో 163.77 మిలియన్ డాలర్లు ఎఫ్డీఐ రూపంలో అందినట్టు పేర్కొన్నారు. 2017-18లో ఆ సంఖ్య 350.22 మిలియన్లని, ఆ తర్వాతి ఏడాదిలో 229మిలియన్ డాలర్ల ఎఫ్డీఐ నమోదైందని స్పష్టం చేశారు.
2020లో భారత్ నుంచి 20.63మిలియన్ డాలర్లు విదేశాలకు వెళ్లినట్టు అనురాగ్ వెల్లడించారు. గతేడాది ఆ సంఖ్య 27.57 మిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- అసలా.. వడ్డీయా..? రెండు ఐచ్ఛికాలపై కేంద్రం స్పష్టత