ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. వృద్ధి మందగిస్తున్న పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం త్వరలో రెండు భారీ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన చేశారు. అయితే వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
"ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ భారత్ వృద్ధి రేటు అధికంగా ఉంది. కానీ వినియోగం ఇంకా పెరగాల్సి ఉంది. అందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనరంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆర్బీఐ సాయం అందిస్తున్న రూ.1.76 కోట్లు ఎలా వినియోగించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
కాంగ్రెస్ హయాంలోనే..
ప్రభుత్వం, దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేదన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు నిర్మల. కాంగ్రెస్ హయాంలోనే ధరల పెరుగుదల ఉందన్నారు.
"కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో ధరలన్నీ రెండంకెల రెట్లు పెరిగాయి. ధరలను అదుపు చేయలేక, అవినీతికి మారుపేరుగా నిలిచిన ఆ పార్టీ ఇప్పుడు ఫిట్, అన్ ఫిట్ గురించి మాట్లాడడం తగదు."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: పసిడికి రెక్కలు- రికార్డు స్థాయికి చేరిన ధర