Latest Kitchen Tools : వంటింట్లో మహిళల పనులు సులువు చేసేలా ఎన్నో రకాల స్మార్ట్ కిచెన్ టూల్స్ ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని సరికొత్తగా ఉండడంతోపాటు.. కిచెన్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరి మీరు కూడా వంటింటిని స్మార్ట్‌గా మార్చాలనుకుంటే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి..
ఈ పరికరం వేరుశనగని ఒలిచేస్తుంది..
నట్స్‌తో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు.. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, పల్లీలు, పిస్తాల్ని ఒలుచుకోవడం మాత్రం ఎక్కువమంది కష్టంగా భావిస్తుంటారు. అదే వీటితో ఏదైనా చిక్కీల్లాంటివి చేయాలంటే పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. అప్పుడు మరింత కష్టంగా ఉంటుంది. అలాకాకుండా ఇవి ఈజీగా రావాలంటే మాత్రం.. 'హ్యాండ్ క్రాంక్ పీనట్ షెల్లర్'ని (Hand crank peanut sheller) ఉపయోగించండి. ఇందులో వేసి తిప్పితే చాలు.. పైన షెల్ మాత్రమే కాదు.. లోపలి పొట్టుకూడా పూర్తిగా వచ్చేస్తుంది.
కావాల్సిన సైజులో..
ఒక్కోసారి ఇంట్లో కాయగూరలు, పండ్లు లాంటివి ఎక్కువగా ఉండిపోతుంటాయి. వీటిని పెట్టడానికి చిన్న బాస్కెట్లు అయితే సరిపోవు. అలా అని మరీ పెద్దవి తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా! అలాంటప్పుడు ఈజీగా ఉండే ఈ 'ఫోల్డబుల్ మల్టీపర్పస్ స్టెయిన్‌లెస్ స్టీల్ బాస్కెట్'ను (Foldable Multipurpose Stainless Steel Basket) ఇంట్లోకి తెచ్చేసుకోండి. సరకు పరిమాణానికి తగినట్లు దీని పొడవు, వెడల్పులను అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్, సెంటర్ టేబుల్, స్పూన్ హోల్డర్‌గా, ప్లేట్ల స్టాండుగా, ఆఫీసులోనూ మొత్తం ఎనిమిది రకాల ఆకృతుల్లో దీన్ని వాడుకోవచ్చు. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసింది కాబట్టి ఎక్కువకాలం మన్నుతుంది.
ఎన్ని గుడ్లు అయినా ఇక నో టెన్షన్..
ఫ్రిడ్జ్‌లో ఎక్కువ గుడ్లను పెట్టాలంటే చోటు సరిపోదు. ఇక డబ్బాల్లాంటి వాటిలో పెట్టాలంటే పగులుతాయనే భయం ఉంటుంది. అయితే.. మీ ఇంట్లో ఈ ఎగ్ స్టోరేజీ బాక్సులు (Egg storage box) ఉంటే గుడ్లు పగులుతాయనే టెన్షన్ అస్సలు ఉండదు. అరలుగా అమరి ఉండే వీటిల్లో రెండు మూడు డజన్ల గుడ్లను కూడా ఈజీగా సర్దుకోవచ్చు. ఫ్రిడ్జ్ అంతా గజిబిజిగా లేకుండా అందంగానూ ఉంటుంది. పైగా ఫ్రిడ్జ్‌లో ఉన్న చోటుని బట్టి ఎక్కడైనా ఉంచేలా ఆటో రీఫిల్, ఎగ్ డ్రాయర్ బాక్సులు, స్కెల్టర్, ట్రే, ర్యాక్స్.. లాంటి రకరకాల డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి.
స్నాక్స్ కోసం స్టోరేజి బాక్సు (Snack storage box)..
ఈవెనింగ్ టైమ్‌లో సరదాగా అందరూ కూర్చొని చిరుతిళ్లు, పండ్లు, నట్స్ లాంటివి తింటుంటారు. అలాంటప్పుడు తినుబండారాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ స్నాక్ స్టోరేజి బాక్సు బాగా ఉపయోగపడుతుంది. చక్కగా సర్వింగ్ ట్రేలా కూడా ఉపయోగపడుతుంది. స్నాక్ స్టోరేజి బాక్సులో రెండు లేయర్లుగా 10 గ్రిడ్‌లు ఉంటాయి. ఒక్కోదాన్లో ఒక్కో స్నాక్ పెట్టచ్చు. మొబైల్‌ఫోన్, ట్యాబ్ లాంటివీ దానిపైనే ఉంచుకునేలా అమరిక ఉంటుంది. అవసరమైతే దీన్నే జ్యుయెలరీ, కాస్మెటిక్ వస్తువుల కోసం కూడా వాడుకోవచ్చు. మరి.. ఇవి మీ ఇంట్లో ఉన్నాయా?
ఇవి కూడా చదవండి :
కూరగాయల తొక్క తీసుకోవడమే కాదు - ఇంట్లోనే కత్తులను పదును పెట్టుకోవచ్చు - ఈ కిచెన్ టూల్స్ చూశారా?
సూపర్ కిచెన్ టిప్స్ : వీటిని ఫాలో అయ్యారంటే - వంటిళ్లు మెరవడంతో పాటు పని కూడా ఎంతో ఈజీ!