Telangana Youth Unemployment : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న 15 నుంచి 29 ఏళ్ల యువతలో నిరుద్యోగం కొంత వరకు తగ్గుముఖం పట్టింది. గత ఏడాది (జులై-సెప్టెంబరు 2023)తో పోలిస్తే నిరుద్యోగ రేటు 22.9 నుంచి 18.1 శాతానికి తగ్గినట్లు నేషనల్ లేబర్ ఫోర్స్ త్రైమాసిక నివేదికలో (జులై-సెప్టెంబరు 2024) వెల్లడైంది. ఆరు నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడం, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు వస్తుండటంతో చదువుకున్న యువతకు ఉపాధి లభిస్తోంది.
నిరుద్యోగరేటులో కేరళ నెంబర్ 01 : అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు 6.6 శాతంగా ఉందని జాతీయ కార్మిక బలగం నివేదిక పేర్కొంది. భారతదేశ దక్షిణాది రాష్ట్రాల్లో పోల్చితే సగటు నిరుద్యోగ రేటులో కేరళ 10.1 శాతంతో మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ 7.3 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు 2.6 శాతంతో దేశ రాజధాని అయిన దిల్లీ తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక 4 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. మొత్తం 22 రాష్ట్రాల నిరుద్యోగ రేటును పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ పదో స్థానంలో ఉంది. జాతీయ నిరుద్యోగ రేటు 6.4 శాతంగా నమోదైంది.
చదువుకున్నా ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తక్కువ : రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నా, మహిళల్లో మాత్రం నిరుద్యోగ రేటు పెరగడం గమనార్హం. గత ఏడాది 2023 జులై-సెప్టెంబరు మహిళల్లో నిరుద్యోగ రేటు 24.3 శాతం ఉంటే, ప్రస్తుతం ఏకంగా 31.3 శాతానికి చేరింది. చదువుకున్నా కూడా మహిళలను మనకున్న సామాజిక కట్టుబాట్లతో ఉద్యోగాలకు పంపించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అవకాశాలు వచ్చినా వివాహాల అనంతరం మహిళలు ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బాధ్యతలని మొదలైన వాటితో కార్మిక బలగంలోకి వెళ్లడం లేదు. పురుషుల్లో నిరుద్యోగ రేటు ఏడాది వ్యవధిలో 23.8 శాతం నుంచి 13.7 శాతానికి భారీగా తగ్గింది. ప్రభుత్వం ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయడం, వెంటనే విధుల్లో చేరేలా అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సర్కారు కొలువులలో కూడా చాలా మంది చేరడం దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇండియాలో భారీగా తగ్గనున్న నిరుద్యోగం - ఆ రంగాల్లో ఫుల్ జాబ్స్! - India Unemployment Rate