కరోనావైరస్ ప్రభావంతో భారత వృద్ధి రేటు అంచనాలను వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి రేటింగ్ ఏజెన్సీలు.
ఇండియా రేటింగ్స్
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) భారత వృద్ధి రేటు అంచనా 3.6 శాతానికి తగ్గించింది ఇండియా రేటింగ్స్. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటు అంచనా 3.6 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించింది ఇండియా రేటింగ్స్.
ఫిచ్ సొల్యూషన్స్..
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధిరేటు 4.6 శాతానికి పరిమితమవుతుందని ఫిచ్ సొల్యూషన్స్ సవరణ అంచనాల్లో తెలిపింది. గత అంచనాల్లో భారత్ 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొనడం గమనార్హం.
కరోనా కారణంగా ప్రైవేట్ వినియోగంతో పాటు పెట్టుబడులు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ పరిణామాలన్నింటి నడుమ భారత వృద్ధి రేటును సవరించినట్లు ఫిచ్ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్-19 వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి అంచనాలు మాత్రం ఇంకా దిగువనే ఉన్నట్లు అభిప్రాయపడింది.
మరిన్ని అంచనాలు దిగువకే..
2020-21లో భారత్ 5.2 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ ఇటీవలే అంచనా వేసింది. ఫిచ్ రేటింగ్స్ కూడా భారత వృద్ధి రేటు అంచనాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం నుంచి ఏకంగా 5.1 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ ప్రభావంతోనే ఈ స్థాయిలో అంచనాలను తగ్గిస్తున్నాయి రేటింగ్ ఏజెన్సీలు.
ఇదీ చూడండి:కరోనా సమయాన 'స్టాక్' పెట్టుబడులు మంచిదేనా?