"క్షీణించిన వృద్ధిరేటు... పెరిగిన ద్రవ్యోల్బణం... 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలు తగ్గింపు"... కొంతకాలంగా ఎక్కడ చూసినా ఇవే ముఖ్యాంశాలు. వృద్ధి గణాంకాలను ఆసరాగా చేసుకుని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. మోదీ సర్కార్ ఆర్థిక విధానాలే ఈ పరిస్థితి కారణమంటూ... "మోదీనామిక్స్" అనే కొత్త పదాన్నీ సృష్టించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
ఆర్థిక పరిస్థితిపై విపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి.
"ప్రతి మూడేళ్లకు డిమాండ్ తగ్గుతుంది. తర్వాత పుంజుకుంటుంది. ఇది ఎప్పుడూ జరిగేదే.
విమానాశ్రయాలు, రైళ్లు రద్దీగా ఉన్నాయి. ప్రజలకు పెళ్లిళ్లు అవుతున్నాయి. అంతా బాగున్నా కొందరు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారు."
-సురేశ్ అంగడి, కేంద్ర మంత్రి
దిల్లీలో త్వరలో ప్రారంభం కానున్న సరుకు రవాణా నడవాను పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సురేశ్.