economic challenges in india: రెండేళ్ల పాటు కరోనాతో ఇబ్బందులు పడ్డ ఆర్థిక వ్యవస్థ.. ఈ కొత్త సంవత్సరంలో పెరుగుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడబోతోంది. అయితే బడ్జెట్ ప్రకటనలు, ఉద్దీపన చర్యల కొనసాగింపు, పరపతి విధానం.. వంటి అంశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలున్నాయి.
ఆర్థికానికి 'బూస్టర్'
భారీ టీకా కార్యక్రమంతో పాటు ఎంపిక చేసిన వ్యక్తుల బృందాలకు బూస్టర్ డోసులను ఈ నెల నుంచి మొదలుపెడుతున్నారు. ఇది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పెరిగే కరోనా కేసుల ఉద్ధృతికి అడ్డుకట్టవేయవచ్చు. రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ బలమైన రికవరీని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ కారణంగా పరిస్థితులు అధ్వానంగా మారితే తప్ప కరోనా ముందుస్థాయిలకు రికవరీ చేరకుండా ఆగదు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం మేర భారీ వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే అది అంతక్రితం అదే సమయంలో నమోదైన 24.4 శాతం క్షీణత కారణంగా ఉన్న ప్రాతిపదిక వల్ల నమోదైంది. కానీ రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో 8.4 శాతం మేర వృద్ధి రేటు నమోదై అర్థవంతమైన రికవరీ ఉందన్న సంకేతాలను పంపింది. ఎగుమతులు సైతం కొద్ది నెలలుగా పెరుగుతూ ఆ సంకేతాలను బలపరుస్తున్నాయి.
2022-23లో 10.3 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పైగా వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ సంఘం ఫిక్కీ అధ్యక్షుడు సంజీవ్ మెహతా అంచనా వేస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో 8 శాతం మేర వృద్ధిని నమోదు చేయడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఉద్యోగ సృష్టిలో వేగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధికి జీడీపీలో స్థిరమైన ప్రగతి చాలా అవసరం. సేవల రంగంలో బలమైన గణాంకాలు నమోదు కావొచ్చని ఫిచ్ అంటోంది. 'ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8.7 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గించాం. అయితే 2022-23లో 10.3 శాతం(+0.2%) మేర నమోదవుతుందని చెబుతున్నాం. వినియోగదారు ఆధారిత రికవరీ; సరఫరా వైపు సమస్యలు తీరడం ఇందుకు ఊతంగా నిలవవచ్చ'ని ఆ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ అంటోంది.
రికవరీలో వేగం పెరగొచ్చు
ఆర్‌బీఐ పరపతి విధానం కూడా ఆర్థిక కార్యకలాపాల్లో ఉద్దీపనకు కారణమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ధోరణులు కాస్త పైకే ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ ప్రస్తుత ధోరణిని ఎంత కాలం పాటు కొనసాగిస్తుందన్నది మార్కెట్లు సునిశతంగా పరిశీలిస్తాయి. మే 2020 నుంచీ ఆర్‌బీఐ తన రుణ రేట్ల(రెపో రేట్లు)ను తక్కువ స్థాయిల్లోనే నిలిపాయి. దీని వల్ల స్థిరాస్తి, తదితర రంగాలకు ఊతం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యయాలు పెరుగుతుండడం వల్ల రికవరీలో వేగం పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. వృద్ధికి కీలమైన ఎగుమతులు కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అంశమని ఆర్‌బీఐ అంటోంది. అనిశ్చితుల మధ్య కేంద్ర బడ్జెట్‌తో పాటు ప్రభుత్వ ద్రవ్య ధోరణులు, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలే భవిష్యత్ సంస్కరణల బాటను నిర్దేశిస్తాయి.
ఇదీ చూడండి: 'డిజిటల్'దే ప్రపంచం.. నైపుణ్యాలున్న వారికి భారీ గిరాకీ