చాలా మంది అవసరానికి డబ్బు లేనప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుందని అనుకుంటారు. అయితే అదొక్కటే కాదు క్రెడిట్ కార్డు వాడకం చాలా సందర్భాల్లో మంచిది. మరి ఆ సందర్భాలేంటో తెలుసుకోండి.
రాయితీలు
బస్సు, రైలు టికెట్లు, సినిమా టికెట్ల కొనుగోలుకు క్రెడిట్ కార్డును వినియోగిస్తే చాలా యాప్‌లు.. రెడ్‌బస్, బుక్‌మై షో, పేటీఎం వంటివి క్రెడిట్ కార్డులపై మాత్రమే ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తుంటాయి. అప్పుడు క్రెడిట్ కార్డు వినియోగం సరిగ్గా ఉపయోగపడుతుంది.
సేవింగ్స్ ఖాతాలో డబ్బులేనప్పుడు
అనుకోని కారణాలతో చాలా మందికి నెలాఖరులో ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ సమయాల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేెయొచ్చు. అదే విధంగా అత్యవసరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు.. వెంటనే బయటి వ్యక్తుల నుంచి అప్పు దొరకటం కష్టం. అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డు చక్కగా ఉపయోగపడుతుంది.
రోజువారీ ఖర్చులకు
రోజూ వారి ఖర్చులకు క్రెడిట్ కార్డులను సమర్థంగా వినియోగించడం వల్ల గరిష్ఠ లాభం పొందేలా చూసుకోవాలి. అదేలా అంటే నెలవారీ సరుకులు, పెట్రోల్ వంటివి కొట్టించుకోవడం కోసం క్రెడిట్ కార్డును వినియోగించాలి. వీటి ద్వారా నెలకు ఎంత ఖర్చు చేస్తున్నాం? అనే లెక్క కచ్చితంగా చూసుకోవచ్చు.
ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ
డెబిట్ కార్డులతో పోలిస్తే క్రెడిట్ కార్డుకు ఆన్లైన్ మోసాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డెబిట్ కార్డు ఏదైనా మోసానికి గురైతే అందులో ఉన్న సొమ్మంతా రిస్కులో పడ్డట్లే. క్రెడిట్ కార్డులో అందుకు అవకాశాలు చాలా తక్కువ.
వ్యక్తి గత పొరపాట్లకు
ఒక వేళ వినియోగదారుడే ఏదైనా పొరపాటు చేస్తే.. డెబిట్ కార్డు ద్వారా ఆ సొమ్మును వెనక్కి రప్పించేందుకు చాలా సమయం తీసుకుంటాయి ఆయా సంస్థలు. అయితే క్రెడిట్ కార్డులో ఏదైన పొరపాటు జరిగితే సదరు బ్యాంకులు వీలైనంత వేగంగా ఆ సొమ్మును వెనక్కి రప్పిస్తాయి.
ఈఎంఐ ద్వారా కొనుగోలుకు
ఈఎంఐ రూపంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే చాలా మంది విక్రయదారులు క్రెడిట్ కార్డు ద్వారానే అందుకు అనుమతిస్తుంటారు. ఇటీవలి కాలంలో డెబిట్ కార్డుతో కొనుగోళ్లకు అనుమతిస్తున్పప్పటికీ అందుకు పరిమితులు ఉన్నాయి.
స్కోరు పెరుగుదల
క్రెడిట్ కార్డు వినియోగిస్తూ సరైన సమయంలో చెల్లింపులు చేయడం ద్వారా క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. దీని ద్వారా భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇల్లు, కారు, వ్యక్తి గత రుణం కావాలనుకుంటే సంస్థలు ఆయా అప్పులను వేగంగా మంజూరు చేస్తాయి.
ఇదీ చూడండి: వాయుసేన అమ్ముల పొదిలో 'అపాచీ' హెలికాప్టర్లు