కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ధి ఒకశాతం మేర క్షీణించనుందని ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ అంచనా వేసింది. వైరస్ వ్యాప్తికి ముందే జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో ఏడాదిపాటు మాంద్యం పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల ఆర్థిక రంగం మందగమనంలో సాగుతున్న కారణంగా ప్రపంచ వృద్ధి క్షీణించనుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ ప్రపంచంలోని 50 శాతం జనాభాను ప్రభావితం చేయనుందని పేర్కొంది ఈఐయూ నివేదిక. అదే సమయంలో 20 శాతం కేసుల్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు నమోదవుతాయని, 1 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తాయని వెల్లడించింది. ప్రపంచ వాణిజ్య వృద్ధిరేటు 0.4 శాతం మేర తగ్గనున్నట్లు అంచనా వేసింది ఈఐయూ.
అమెరికా వృద్ధిలో క్షీణత
అగ్రరాజ్యం అమెరికా వృద్ధిని సమీక్షించిన ఈఐయూ ఒకశాతం మేర ఆ దేశ వృద్ధి మందగించనుందని అంచనా వేసింది. అదే సమయంలో వైరస్ కేంద్రస్థానమైన చైనా వృద్ధి రెండు శాతం మేర క్షీణిస్తుందని పేర్కొంది. ఐరోపాలో ఏడాది పొడవునా 0.5 శాతం మేర మందగమనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కరోనాను అడ్డుకునేందుకు తీసుకునే చర్యల వల్ల వైరస్ నియంత్రణ సాధ్యమవుతోందని.. కానీ ఖర్చు పెరగడం కారణంగా డిమాండ్, సప్లైల్లో భేదాలు నమోదు కానున్నట్లు వెల్లడించింది.
కరోనా నియంత్రణకు ఏడీబీ నిధులు..
కరోనా వైరస్‌పై పోరాడేందుకు సభ్యదేశాలకు 6.5 బిలియన్ డాలర్ల నిధులు అందిస్తామని ప్రకటించింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. అత్యవసరంగా ఇవ్వాల్సిన నిధులను తక్షణం అందిస్తామని స్పష్టం చేసింది.
"ఈ మహమ్మారి ప్రపంచానికి ముప్పుగా పరిణమించింది. వైరస్ నియంత్రణకు తీవ్ర చర్యలు అవసరం. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలి. మా సభ్య దేశాలు వైరస్‌పై పోరాడేందుకు తీవ్ర చర్యలు చేపట్టాం."
- మసాత్సుగు అసాకవా, ఏడీబీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'పౌండ్' భారీ పతనం-1985 తర్వాత ఇదే ప్రథమం