ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిరేటును సాధించటం.. భారత్‌కు నెరవేరని లక్ష్యంగానే కనిపిస్తోంది. కరోనా ఉత్పరివర్తనం చెందుతూ వ్యాపిస్తుండటం, వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో వ్యాపార కార్యాకలాపాలు స్తంభించటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతుండటం కారణంగా.. వృద్ధిరేటు పెరిగే సూచనలు కనిపించటం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహా ఇతర సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.5 శాతానికే పరిమితమవుతుందని చెబుతున్నాయి. అంతకుముందు ఇవే సంస్థలు 10.5-13.7శాతం మధ్య వృద్ధిరేటు ఉంటుందని లెక్కగట్టాయి. కరోనా రెండో దశతో వాటిల్లిన నష్టం, పొంచి ఉన్న మూడో దశ ముప్పు కారణంగా వృద్ధి అంచనాలను ఆయా సంస్థలు గణనీయంగా తగ్గించాయి.
తగ్గించిన మూడీస్...
ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను 13.9 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై పడిందని తన నివేదికలో తెలిపింది. 'కరోనా కారణంగా 2021 వృద్ధి అంచనాలపై అనిశ్చితి కనిపిస్తోంది. అయితే ఏప్రిల్- జూన్ త్రైమాసికానికే అది పరిమితం కావొచ్చు. ఈ ఏడాది భారత వాస్తవ జీడీపీ 9.6శాతం, 2022లో 7శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నాం' అని వెల్లడించింది.
రూ.5.48 లక్షల కోట్ల నష్టం..
బ్రిటన్‌కు చెందిన 'బార్క్లేస్' అనే బ్రోకరేజ్ సంస్థ కూడా.. 2022లో భారత వృద్ధి రేటు అంచనాను 0.8 శాతం తగ్గించి 9.2 శాతానికి పరిమితమవుతుందని చెప్పింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వంటి తదితర నిబంధనల వల్ల ఏప్రిల్-జూన్ మధ్య రూ.5.48 లక్షల కోట్ల సంపదను భారత్ నష్టపోయినట్లు అంచనా వేసింది.
ఆర్బీఐ అంచనా 9.5శాతమే..
కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా వృద్ధి రేటు 9.5శాతానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పింది ఆర్బీఐ. '2021-22లో వాస్తవ జీడీపీ 9.5శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 18.5శాతం, జులై-సెప్టెంబర్‌లో 7.9శాతం, అక్టోబర్-డిసెంబర్లో 7.2శాతం, జనవరి- మార్చిలో 6.6శాతం వృద్ధి ఉంటుంది' అని ఈ నెల ప్రారంభంలో నూతన పరపతి విధానాన్ని ప్రకటించినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ తెలిపారు.
వేరియంట్లతో పొంచి ఉన్న ముప్పు..
భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతికి డెల్టా వేరియంట్ కారణం కాగా.. ఇప్పుడు వైరస్ మళ్లీ ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌గా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఈ వేరియంట్‌ను ఆందోళకరమైన వైరస్ రకంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెంది.. మూడో దశ కరోనా ముప్పుకు దారి తీయవచ్చని.. తద్వారా.. ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భయాలు వినిపిస్తున్నాయి.
టీకాలతోనే పునరుజ్జీవం..
వ్యాక్సినేషన్ కార్యక్రమం పుంజుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా పెరిగే అవకాశం ఉందని మూడీస్ సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్‌లో రోజూ కోటీ టీకా డోసుల చొప్పున పంపిణీ చేస్తే ఆర్థిక పునరుజ్జీవం సాధ్యమవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: Corona Pandemic: దేశార్థికానికి కొవిడ్ శరాఘాతాలు
ఇదీ చూడండి: కొవిడ్ 2.0తో రూ.2 లక్షల కోట్ల నష్టం!