కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా కుదేలవుతున్న తరుణంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఛీఫ్ క్రిస్టాలినా జార్జివా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలను బట్టి మాంద్యం పరిస్థితుల్లోకి ప్రవేశించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 2009లో సంభవించిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కనీసం 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు.
సాయం కోసం 80 దేశాలు
అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు జార్జివా. గత కొద్ది వారాలుగా ఆయా దేశాల్లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్లు తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన 80కి పైగా దేశాలు అత్యవసర సహాయ నిధి కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయ వనరులు ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు సరిపోవని ఉద్ఘాటించారు.
కరోనా నేపథ్యంలో 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదించడాన్ని స్వాగతించారు క్రిస్టాలినా. పరిస్థితులు మరింత దిగజారకుండా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చర్యలు తీసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కరోనా పంజా: 26 వేలు దాటిన మరణాలు