కొవిడ్-19 మొదటి విడత పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని గాడిన పడుతున్న తరుణంలో అనూహ్యంగా విరుచుకుపడిన రెండో దశ వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఓ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. కానీ మొదటి విడతతో పోల్చితే, రెండో దశ ముప్పు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. దీని నుంచి త్వరగా కోలుకుంటామని, మళ్లీ ఆకర్షణీయ వృద్ధి బాటలో దేశం ముందుకు వెళ్తుందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధ్యమని, ఆపై ఏళ్లలో 7 శాతానికి పైగా వృద్ధి నమోదు చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 'భారత ఆర్థిక వ్యవస్థ- వృద్ధి బాట, భవిష్యత్తు' అనే అంశంపై సోమవారం ఎఫ్‌టీసీసీఐ (తెలంగాణా వర్తక, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య) నిర్వహించిన ఓం ప్రకాష్ టిబ్రేవాలా స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
సంస్కరణలు ఫలితాలు ఇస్తున్నాయ్
వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఆర్థికాభివృద్ధి గణనీయంగా మెరుగుపడనుందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ విశ్లేషించారు. కార్మిక సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణకు ప్రాధాన్యం, ఉత్పత్తి రంగానికి ప్రోత్సాహం, 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్‌ఐ పథకం ఆవిష్కరణ, వ్యవసాయం, విద్యుత్తు- రహదార్లకు ప్రాధాన్యం.. తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. జీఎస్‌టీ అధిక వసూళ్లు పెరుగుతున్న వినియోగానికి సంకేతమని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎఫ్‌సీఎఫ్ (గ్రాస్ ఫిక్స్‌డ్ కేపిటల్ ఫార్మేషన్), జీడీపీలో 34.3 శాతంగా నమోదైనట్లు, ఇది గత ఆరేళ్ల కాలంలో గరిష్ఠమని పేర్కొన్నారు.
సజావుగా రూ.1.75 లక్షల కోట్ల ఉపసంహరణ ప్రక్రియ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలనే లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. ఎల్‌ఐసీ, బీపీసీఎల్, ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తదితర సంస్థల్లో వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి ఈ ఏడాది ఎంతో ముఖ్యమైన ఏడాదిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలోనూ అడుగులు పడుతున్నట్లు తెలిపారు. ఎఫ్‌టీసీసీఐ కార్యవర్గం, సభ్యులు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : ఐటీఆర్ దాఖలు చేస్తే.. ఈజీ రుణాలు, వీసా కూడా?