వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) కేంద్ర బడ్జెట్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌కు ఒక రోజు ముందు (జనవరి 31న) ఆర్థిక సర్వే వెలువడనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత జులై 4న వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మోదీ 2.0 ప్రభుత్వంలో ప్రధానంగా 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల అర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కువ దృష్టి సారించింది.
ఈ సారి బడ్జెట్‌కు ఎందుకంత ప్రాధాన్యం?
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 శనివారం సెలవు దినం అయినందున.. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని మారుస్తారా అన్న సందేహాలు వెలువడ్డాయి. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టడంలో "ప్రస్తుత సంప్రదాయం కొనసాగొచ్చు" అని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల వెల్లడించారు.
2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడితే.. 2015-16 తర్వాత శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపట్టడం ఇదే తొలి సారి అవుతుంది.
మోదీ మొదటి దఫా పాలనలో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని మారుస్తూ.. 2017-18లో తొలిసారి ఫిబ్రవరి 1న పద్దు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది.