సంపన్న వర్గాలు ఎల్పీజీ రాయితీని వదులుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'గివ్ ఇట్ అప్' కార్యక్రమం తరహాలోనే.. వాహనదారుల కోసం 'స్వచ్ఛంద స్క్రాపేజ్(తుక్కు) పాలసీ'ని తీసుకురావాలని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021-22 సార్వత్రిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటి పథకంతో ముందుకు రావాలని సూచించింది.
వాహనదారులు తమ పాత వాహనాలను మార్చుకోమని ఒత్తిడి చేయడం కన్నా.. వారిని ఆ దిశగా ప్రోత్సహించడం ఉత్తమమైన ఆలోచన అని ఫాడా అభిప్రాయపడింది. వంట గ్యాస్ సబ్సీడి వదులుకోమని ప్రధాని ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందనతో ఈ విషయం రుజువైందని గుర్తుచేసింది.
మెరుగైన ఫలితాల కోసం.. 2000 మార్చి 31 వరకు రిజిస్టరైన వహనాలన్నింటికీ ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.
'ఈ పథకానికి ఆర్థిక ప్రోత్సాహకాలు తోడైతే.. అభివృద్ధి చెందిన దేశాల్లానే తక్షణమే దాని ఫలితాలు కనిపిస్తాయి. సింగిల్ విండో ఫ్లీట్ మోడ్రనైజేషన్ ద్వారా పాత వాహనాలను మార్చుకునేందుకు.. రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో ఈ పథకం విజయవంతమైంది' అని ఫాడా వివరించింది.
డిమాండ్‌పైనే బడ్జెట్ దృష్టి సారించాలి..
"అన్‌లాక్ మార్గదర్శకాలతో సరఫరా వేగంగా కోలుకుంటోంది. డిమాండ్ మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంది" అని ఫాడా పేర్కొంది. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం డిమాండ్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆటోమొబైల్ డీలర్లు.
2021-22 బడ్జెట్లో కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేలా, వినియోగ డిమాండ్ పెరిగేలా ప్రభుత్వ చర్యలుండాలి అంటున్నారు.
పండుగ సీజన్, ఈ ఏడాది ఆరంభం నుంచి ధరలు పెరగనున్నాయన్న కారణంతో 2020-21లో తొలిసారి వాహన విక్రయాలు డిసెంబర్లో సానుకూలంగా నమోదైట్లు ఫాడా తెలిపింది. దేశవ్యాప్తంగా 1,477 ప్రాంతీయ రవాణా కార్యలయాల్లో (ఆర్టీఓ) వాహనాల రిజిస్ట్రేషన్లు 11.01 శాతం పెరిగినట్లు పేర్కొంది.
గత ఏడాది ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం పరిశ్రమకు అవకాశాలు పెంచిందని ఫాడా పేర్కొంది. రానున్న బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.