స్థానిక వ్యాపారాలు, ఎమ్ఎస్ఎమ్ఈలను కాపాడటం కోసం ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ నెల 12 జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ హామీని నెరవేర్చుతూ.. బుధవారం నిర్మలా సీతారామన్ భారీ ఉద్దీపనలను ప్రకటించారు. దీర్ఘకాలిక అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
నిర్మాణాత్మక సంస్కరణలు...
ఎమ్ఎస్ఎమ్ఈల్లోని ఉత్పత్తి, సేవల విభాగాలను పాత విధానాలు ఎంతో వర్గీకరించాయి. పెట్టుబడుల పరిమితులపై బెంచ్మార్కులు విధించేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రకాల పరిశ్రమలకు ఒకటే తరహా బెంచ్మార్కులు ఉండనున్నాయి. పెట్టుబడులతో పాటు ఆదాయాన్ని కూడా ఇందులో చేర్చారు. వీటి వల్ల వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇది నిర్మాణాత్మక సంస్కరణ.
క్రెడిట్ గ్యారెంటీ...
ఎమ్ఎస్ఎమ్ఈల సమస్యలను తొలగించేందుకు బిలియన్ డాలర్ల క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించారు ఆర్థికమంత్రి. వీటి వల్ల ద్రవ్య సమస్యలు పరిష్కారమై.. సంస్థల మనుగడకు అవకాశం లభిస్తుంది.
ఈ రంగంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలతో పాటు మూడు నెలల పాటు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పథకాన్ని పొడిగించడం ద్వారా.. ఎన్నో ఉద్యోగాలు భద్రంగా ఉండనున్నాయి.
ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. 50వేల కోట్లు అందించడం మరో శుభపరిణామం. వీటివల్ల ఈక్విటీ కాంట్రిబ్యూషన్ సరిగ్గా జరుగుతుంది. కరోనా సంక్షోభంతో కుదేలైన ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇది ఎంతో ఉపయోగకరం.
గ్లోబల్ టెండర్లు...
రూ. 200కోట్లుపైబడిన ప్రాజెక్టులకు గ్లోబల్ టెండర్లను రద్దు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఇది ఊతమందిస్తుంది. బడా కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న చిన్న, స్థానిక పరిశ్రమలు, సరఫరాదారులకు ఇది ఎంతో ముఖ్యం.
ప్యాకేజీ వెనుక ఉన్న ఉద్దేశం ఎంతో మంచిది. కానీ దీనిని ఎలా అమలు చేస్తారన్నదే అసలు ప్రశ్న.
రచయిత-- ప్రతిమ్ రంజన్ బోస్, సీనియర్ పాత్రికేయులు, కోల్కతా.
- ఈ కథనంలోని అంశాలు కేవలం రచయిత సొంత అభిప్రాయాలు