ప్రజా సంక్షేమంతో ముడిపడిన కీలక రంగాలకు కొత్త రూపు కల్పించడం సహా వృద్ధికి ఊతమిచ్చేలా వ్యాపార విధానాలను మార్చడమే లక్ష్యంగా సంస్కరణల ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మనిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా వరుసగా 5వ రోజు ఈమేరకు వివరాలను వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చివరి విడతలో ఉపాధి హామీ, విద్య, వైద్యం సహా వ్యాపార సంబంధిత అంశాలపై సంస్కరణలు ప్రకటించారు. ఆదాయ వనరుల కొరతతో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు చేయూత అందించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉపాధి
స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు ఉపాధికి కొరత రాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకుంటుందని నిర్మల సీతారామన్ అన్నారు. వారికి పని కల్పించే విధంగా ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయం ద్వారా 300 కోట్ల అదనపు పని రోజులు లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ-విద్య
కరోనా వైరస్ నేపథ్యంలో సాంకేతికత ఆధారిత విద్యపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ విద్యకు భారీ ఎత్తున ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 3 స్వయంప్రభ ఛానెళ్లకు అదనంగా మరో 12 ఛానెళ్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
వైద్యం
కొవిడ్ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తు సంక్షోభం ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. వైద్య రంగంలో క్షేత్ర స్థాయిలోనూ పెట్టుబడులు భారీగా పెరిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కరోనా వంటి ప్రమాదాలెన్ని వచ్చినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
వైద్య రంగానికి సంబంధించి ఇప్పటికే రూ.15 వేల కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు నిర్మల. రాష్ట్రాలకు రూ.4113 కోట్లు, అత్యవసర వస్తువుల కోసం రూ.3750 కోట్లు, టెస్టింగ్ ల్యాబ్‌లు, కిట్ల కోసం రూ.550 కోట్ల నిధులు వెచ్చించినట్లు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద వైద్య నిపుణులకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
సులభతర వాణిజ్యం
సులభతర వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిర్మల తెలిపారు. కొత్తగా ఏర్పడే దివాలా ప్రక్రియలను సంవత్సరం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్ సంక్షోభంలో కంపెనీలు చవిచూసిన నష్టాలను దివాలా నుంచి మినాహాయిస్తున్నట్లు వెల్లడించారు.
కొవిడ్ సమయంలో వ్యాపార సంస్థలపై అదనపు భారం పడకుండా కంపెనీల చట్టానికి తగిన సవరణలు చేపడుతున్నట్లు చెప్పారు నిర్మల. ఆన్లైన్లో బోర్డు మీటింగ్‌లు నిర్వహించుకునేలా అనుమతించినట్లు స్పష్టం చేశారు. రైట్స్ ఇష్యూను డిజిటల్ రూపంలో చేపట్టడం సహా కార్పొరేట్ గవర్నెన్స్‌లో భారీ సంస్కరణలకు నాంది పలికినట్లు వివరించారు.
కంపెనీల చట్టం సవరణ
కంపెనీల చట్టంలో నేరపూరిత అంశాలుగా పరిగణిస్తున్న చిన్నచిన్న సాంకేతిక పొరపాట్లను శిక్షాస్మృతి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు నిర్మల. దీని వల్ల కంపెనీలకు తక్షణం ఊరట లభిస్తుందని చెప్పారు. దీంతో పాటు మరిన్ని వెసులుబాట్లు కల్పించేలా కంపెనీల చట్టానికి సవరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు కొత్త విధానం
ప్రభుత్వ రంగ సంస్థల నూతన విధివిధానాలపైనే దేశం కలలు కంటున్న ఆత్మనిర్భర భారత్ ఆధారపడి ఉందని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సరైన ప్రాధాన్యం ఇస్తూనే అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు అనుమతించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలకు అండ
సంక్షోభం నేపథ్యంలో తీవ్ర ఆదాయ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను వివరించారు నిర్మల. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తగిన సాయం ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు పన్నుల్లో వాటా విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.
రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.12,390 కోట్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ ద్వారా రూ.11,092 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు నిర్మల. విపత్తు నిర్వహణ కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు రూ.46,038 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి పలు వెసులుబాట్లు కల్పించారు విత్తమంత్రి.