భారత్-అమెరికా మధ్య ఓ పరిమిత వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సమాఖ్య( యూఎస్ఐస్పీఎఫ్) అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ముఖేశ్ ఆఘీ. దిల్లీ వేదికగా మంగళవారం జరిగిన భారత నాయకత్వ రెండో వార్షిక సమావేశం వేదికగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, భారత్, అమెరికా వ్యాపార సంస్థలకు చెందిన ముఖ్య కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితులు మెరుగైతే పలు అమెరికా వ్యాపార సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని... ఈటీవి భారత్‌కు ఇచ్చిన ముఖాముఖి వేదికగా వ్యాఖ్యానించారు.
ప్రశ్న: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ అంశంపై మీకున్న ప్రధాన లక్ష్యం?
జవాబు: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని.. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యాపారాన్ని వేరువేరుగా చూడాలి. 142 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని ఈ ఏడాది మేం 160 బిలియన్ డాలర్లకు మార్చాలనుకుంటున్నాం. గత త్రైమాసికంలో భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులు 30శాతం పెరిగాయి. మొత్తంగా ఇది 16 శాతం. భారత్‌లోని అమెరికా వ్యాపార సంస్థలను ఈ విషయమై ప్రశ్నిస్తే.. వారు రెండింతలు పెరిగిందని వెల్లడిస్తారు. మొత్తంగా చూస్తే ఇరుదేశాల మధ్య మంచి వాణిజ్యమే జరుగుతోంది. మనం త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలి. చాలా తక్కువ అంశాల్లో ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లోగా ఒప్పందం పూర్తవ్వాలి.
ప్రశ్న: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సమాఖ్య నాయకత్వ సదస్సు వేదికగా వాణిజ్య ఒప్పందంపై భారత్‌కు కొన్ని హామీలు లభించాయని విదేశాంగమంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ద్వారా విన్నాం. పాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఆటంకంగా ఉన్న భేదాభిప్రాయాలు ఏమిటి? వీటిపై ఏకాభిప్రాయానికి వస్తున్నారా?
జవాబు: కొన్ని పరిమితులు ఉన్నాయి. వైద్య చికిత్సకు సంబంధించిన స్టెంట్లు, మోకాలి రక్షణకు సంబంధించిన భారత్ ఎగుమతులపై పరిమితులు ఉన్నాయి. యాపిల్, బాదం ఎగుమతులపై అమెరికాకు ఆంక్షలున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సమతౌల్యత ఉండాలి. ఇరు దేశాల ఉద్దేశాలు, వైఖరులపై నాకున్న అవగాహన మేరకు పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్యమంత్రి లైటైజర్.. ఒప్పందాన్ని పూర్తి చేస్తారు.
ప్రశ్న: మే 30 వరకు వాణిజ్యంపై పెద్దగా అవగాహన లేదని యూఎస్ఐఎస్పీఎఫ్ వేదికగా గోయల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్యమంత్రి లైటిజర్ సంక్లిష్టమైన సంప్రదింపుల్లో సహాయం చేస్తున్నారని తెలిపారు. ఇది దౌత్యపరంగా పూర్తిగా అనుభవరాహిత్యమని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. మీ అభిప్రాయం.?
జవాబు: నేను అలా అనుకోవడం లేదు. వాణిజ్య చర్చల అంశంలో లైటైజర్కు సమాన స్థాయిలో గోయల్ ముందుకు సాగుతున్నారు.
ప్రశ్న: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ద్వారా భారత్ లాభపడుతుందని అనుకుంటున్నారా?
జవాబు: పన్నులు తగ్గించడం ద్వారా భారత్ తన విధానాల్లో కొంత మార్పులు చేసింది. ఈ నెలాఖరు వరకు భారత్‌లోకి నూతనంగా వచ్చే వస్తువులకు 17 శాతం పన్ను మినహాయింపు లభిస్తోంది. కార్మిక సంస్కరణలు, భూ సంస్కరణల ద్వారా భారత్ మరింత ముందుకు వెళ్లనుంది. 200పైగా అమెరికన్ కంపెనీలు... 'చైనా ప్లస్ వన్' అనే వ్యూహంలో భాగంగా భారత్‌ను ప్రాధామ్యంగా పెట్టుకున్నాయి. మా విశ్లేషణ ప్రకారం ఆయా కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పడం ద్వారా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని అంచనా. భారత్ కేవలం ఉత్పత్తికి అనుకూలమే కాదు.. అమెరికా ఉత్పత్తులకు చైనా దారుల మూసివేత దృష్ట్యా అతిపెద్ద మార్కెట్ కూడా. మొత్తం వ్యాపార కోణంలో చూస్తే ఉత్పత్తి ఊపందుకుంటే భారత్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది.
ప్రశ్న: మరి ఇండోనేషియా, వియత్నాంలకు వ్యాపారాలు ఎందుకు తరలుతున్నాయి? భారత్‌కు ఇంకా ఏమి కావాలి?
జవాబు: వియత్నాం, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లకు వెళ్లేదంతా తక్కువ స్థాయి ఉత్పత్తి. వ్యాపార సంస్థలు అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ నిపుణులు, డిజైనర్ల కోసం చూస్తాయి. ఈ నిపుణులు భారత్‌లోనే లభిస్తున్నారు. వారి సామర్థ్యాలను పెంచవచ్చు కూడా. ఈ నేపథ్యంలో భారత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుంటే వ్యాపార సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. భారత్ విజయాలను వివరించి ఇక్కడకి తీసుకురావడం.. ప్రభుత్వం వారికి అవసరమైన కార్మిక, భూమి వంటి వ్యవస్థాపన సౌకర్యాల కల్పన, సులభతర వాణిజ్య విధానాలు చేపట్టడమే అతిపెద్ద సవాలు. సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో ప్రస్తుతం భారత్ 77వ స్థానంలో ఉంది. అదే చైనా 26లో కొనసాగుతోంది. ఈ ఖాళీని పూరించడంపై దృష్టి సారించి... ర్యాంకింగ్‌లో 50 లోపునకు చేరుకునేందుకు యత్నించాలి.
ప్రశ్న: ఇతర అమెరికా వ్యాపారవేత్తలతో కలసి ప్రధానితో సమావేశమయ్యారు. ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు?
జవాబు: వ్యాపారవేత్తల తరఫు నుంచి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాం. భారత్ ఇప్పటికీ ఒక మంచి అవకాశమున్న మార్కెట్ అన్న అభిప్రాయం కల్పించాం. ప్రతి కోణం నుంచి భారత్‌లో రెట్టింపు కృషి చేయబోతున్నాం. 5 నుంచి 10 ఏళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రయాణంలో మేమూ భాగస్వాములం కావాలనుకుంటున్నాం. ప్రధాని మోదీ వ్యాపారవేత్తలకు అవసరమైన ప్రజాస్వామ్యం, మేధస్సు మా వ్దద ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌లో జీవన ప్రమాణాలు, సౌలభ్యాలను పెంచడంపై ఆయన పేర్కొన్నారు. చాలా పారదర్శకంగా సమావేశం జరిగింది. సభ్య వ్యాపార సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటి అడుగులను ఇక్కడ విస్తరింపజేయాలని భావిస్తున్నాయి.
ప్రశ్న: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్లో అమెరికా పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించిందా?
జవాబు: జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. కశ్మీర్లో పర్యటక రంగానికి అనుకూలంగా ఉంటుంది. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో ఒక పెట్టుబడిదారుల సమావేశాన్ని మీరు చూస్తారు. మానవ హక్కుల ఉల్లంఘనపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. గత 70 రోజులుగా విధించిన ఆంక్షల నేపథ్యంలో తక్కువ మరణాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక స్థిరత్వం నెలకొంది. అయితే ఆంక్షల కారణంగా ఆక్కడ వాస్తవికంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. సమాచార వ్యవస్థను పునరుద్ధరించారు. సమీప భవిష్యత్తులో కశ్మీర్ సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నాం. అమెరికా వ్యాపార సంస్థలు అక్కడికి వెళ్లి వ్యాపారాలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
ప్రశ్న: ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో కొంతమంది చట్టసభ్యులు జీఎస్పీ(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ని పాక్షికంగా పునరుద్ధరించాలని ట్రంప్‌నకు లేఖ రాశారు. ఈ అంశం ఎలా ఉండనుంది? ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు జరిగే నష్టమేమిటి?
జవాబు: అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై జీఎస్పీ తొలగింపు వల్ల ఎలాంటి ప్రభావం చూపించలేదు. అమెరికా దిగుమతిదారులు జీఎస్పీని కొనసాగించాలని ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సంప్రదింపుల్లో జీఎస్పీ పైనా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పాక్షికంగా నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది.
ప్రశ్న: హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోదీ ర్యాలీని 2020 ఎన్నికలకు ట్రంప్ తరఫున ప్రచారమని రిపబ్లికన్ పార్టీ ప్రచారం చేస్తోంది. అది సరైన వ్యాఖ్యానమేనా?
జవాబు: నేను అలా అనుకోవడం లేదు. ట్రంప్ ఎందుకు హ్యూస్టన్‌కు వెళ్లారో అర్థం చేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో టెక్సాస్ రాష్ట్రం డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు కీలకంగా మారనుంది. 14 శాతం భారతీయ అమెరికన్లు మాత్రమే గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటువేశారు. వారిని తన వైపుకు తిప్పుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. వారు అత్యంత సంపన్నులైన మైనారిటీలు మాత్రమే. తలసరి ప్రాతిపదికన చూస్తే వారు ఎన్నికల ప్రచారానికి అధిక మొత్తంలో వెచ్చిస్తారు. వేడుకకు 50 వేలమంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ రకంగా చూస్తే ఇందులో విస్తృత ప్రయోజనాలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తరఫున మోదీ ప్రచారం చేశారని అనుకోను. గాంధీ 150 జయంతి సందర్భంగా డెమొక్రాట్ నేత, స్పీకర్ నాన్సీ పెలోసీకీ ఆతిథ్యమిచ్చారు. ఆ సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు మద్దతిస్తానని పెలోసీ వెల్లడించారు. అందువల్ల దీనిపై ఉన్న సందేశాలను ఆమె తొలగించారు.
ప్రశ్న: అయితే ఉద్దేశపూర్వకంగానే హ్యూస్టన్ కార్యక్రమాన్ని రిపబ్లికన్ ప్రచార కమిటీ తప్పుగా చిత్రీకరిస్తోందా?
జవాబు: రిపబ్లికన్లు వారి సొంత అజెండా కోసం మోదీని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అనుకుంటున్నాను.
ఇదీ చూడండి: ఉల్లాసంగా- ఉత్సాహంగా గజరాజుల 'ఫుట్‌బాల్'