మోదీ 2.0 ప్రభుత్వం తొలి రోజుల పాలన ఏకపక్షం. రాజకీయంగా, పరిపాలనపరంగా అంతా ఎన్డీఏకు అనుకూలమే. ఆర్థికపరంగా మాత్రం పెను సవాలు ఎదురైంది.
నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి మన ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలోనే ఉంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ ఆర్థిక స్థిరత్వమే ప్రమాదంలో ఉంది. వ్యవసాయ సంక్షోభం కూడా విజృంభిస్తోంది. గ్రామాల్లో ప్రజల ఆదాయం పెంచడం అతి పెద్ద సవాల్‌గా ఉంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్లు పతనమై బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి.
బలమైన ప్రతికూల సంకేతాలు...
ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతోందన్న సంకేతాలు ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠంతో 5 శాతానికి చేరింది. అంతకుముందు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది 5.8 శాతంగా ఉంది. 2018-19 తొలి త్రైమాసికంలో ఇది 8 శాతంగా ఉందంటే వృద్ధి ఎంతలా క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
వృద్ధి మందగమనం... ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019 ఏప్రిల్-ఆగస్టు మధ్యలో ఆటోమొబైల్ రంగంలో.. 3 లక్షల 50 వేల ఉద్యోగాలకు కోత పడింది. 10 శాతం వృద్ధిని మాత్రమే సాధించింది.
ఎఫ్ఎంసీజీ రంగానిదీ అదే పరిస్థితి. సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, టీ పొడి అమ్మకాలు క్షీణించాయి. పార్లే వంటి సంస్థలు... తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడం వల్ల పదో వంతు ఉద్యోగుల్ని తొలగించాయి.
''ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిశ్రమల్లో పురోగతి కోసం... ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఆ దిశగా పయనిస్తోంది. కానీ.. ఆటో, వస్త్ర పరిశ్రమల్లో ఎన్నో సవాళ్లున్నాయి. ఈ రంగాల్లో మెరుగైన ఫలితాల కోసం... కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. అవసరమైన ప్యాకేజీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయో అన్నింటినీ పరిశీలిస్తుంది.''
- గోపాల్ అగర్వాల్, భాజపా జాతీయ అధికార ప్రతినిధి
మాంద్యానికి 'సీతమ్మ' మందు
మాంద్యం రూపంలో పొంచి ఉన్న ముప్పును కేంద్రం సకాలంలోనే గుర్తించింది. నష్టనివారణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తొలుత దేశీయ, విదేశీ సంస్థాగత మదుపర్లపై సర్‌ఛార్జీ ఉపసంహరణతో దిద్దుబాటు చర్యలు ఆరంభించింది కేంద్రం. ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ, ఇటీవలి బ్యాంకుల విలీనం వరకు కీలకాస్త్రాలన్నీ ప్రయోగిస్తూనే ఉంది.
తొలుత 2019 ఆగస్టు 28న స్టార్టప్‌లకు ఏంజెల్ టాక్స్ మినహాయింపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు 70 వేల కోట్ల మూలధన నిధులు, ఆటో రంగానికి ప్రోత్సాహం, పాత వాహనాల రద్దు వంటి కీలక నిర్ణయాలెన్నో తీసుకుంది కేంద్రం.
ఇదీ చూడండి: మోదీ 2.0: నరేంద్రుడి సంచలనాల సెంచరీ
బొగ్గు, ఒప్పంద తయారీ రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మీడియాలో 26 శాతం ఎఫ్‌డీఐలకు అంగీకారం తెలిపింది.
2019 ఆగస్టు 30న ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులగా విలీనం చేయాలని తీర్మానించింది. మొత్తంగా 27గా ఉన్న పీఎస్‌బీల సంఖ్య 12కు చేరింది.
ఈ ఉద్దీపన చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది కేంద్రం. డిమాండ్ పెరిగి.. ప్రగతి రథం గాడిలో పడుతుందని ఆశిస్తోంది.
''ఆర్థిక విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కొత్త కొత్త నియమాలు వచ్చాయి. 5 ట్రిలియన్ డాలర్ల దేశ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రోడ్ మ్యాప్ స్పష్టంగా ఉంది. ఆ తర్వాత జరిగినవి చూసుకుంటే.. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు కుదించింది కేంద్రం. బ్యాంకులకు పెట్టుబడి సాయంగా రూ. 70 వేల కోట్ల మూలధన నిధులు ప్రకటించింది. ఎన్బీఎఫ్సీ సమస్యల పరిష్కారానికి పూనుకుంది.''
- గోపాల్ అగర్వాల్, భాజపా జాతీయ అధికార ప్రతినిధి
'ఉపాధి కల్పించండి... అప్పుడే జీడీపీ వృద్ధి'
బ్యాంకుల విలీనం వంటి సంస్కరణలతోపాటు గ్రామీణ వృద్ధిని వేగవంతం చేయడం, వ్యవసాయ రంగంలో ప్రాథమిక సమస్యల్ని పరిష్కరించడం ముఖ్యమన్నది నిపుణుల అభిప్రాయం. ద్రవ్య లోటుతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలన్నది వారి సూచన.
''ప్రస్తుతం ప్రభుత్వం జీడీపీపై దృష్టి పెట్టకుండా... ఉపాధి సృష్టి గురించి ఆలోచించాలి. ఒక్కసారి ఉపాధి సృష్టికి మార్గం సుగమమైతే.. మిగతా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉపాధి కల్పించండి. వెంటనే వినియోగం పెరుగుతుంది. తయారీ, ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతాయి. జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. దేశంలో ఇంకా సామాజిక, రాజకీయ స్థిరత్వం వస్తుంది.
భారత ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా, లేదా అనేదే ఆలోచించాలి. ఆ కోణంలో చూడండి. దేశం దృష్టిలో మిగతావన్నీ తర్వాతే.''
- విజయ్ సర్దానా, ఆర్థికవేత్త, సెబీ సలహాదారు