దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ భయం ప్రముఖులకూ పట్టుకుంది. ఎస్‌బ్యాంకు వ్యవస్థాపకుడు.. సంస్థలో ఆర్థిక సంక్షోభానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రానా కపూర్ జైల్లోనే ఉంటే కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ముంబై కోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు న్యాయవాది. అయితే రానా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 2వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు జడ్జి.
ఎస్ బ్యాంకు వ్యవహారంలో రానా కపూర్‌పై విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన కారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని రానా కపూర్‌కు జడ్జి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తాను గత ఏడేళ్లుగా ఆస్థమాతో బాధపడుతున్నానని, తక్కువ రోగనిరోధక శక్తితో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.
అదే సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు త్వరగా కరోనా బారిన పడే అవకాశం ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది అబ్బాద్ పాండా కోర్టుకు విన్నవించారు. రానాకు పెద్ద సెల్లో వసతి కల్పించాలని కోరారు. రానా తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉండే గదిని కేటాయించాలని జైలు అధికారులకు సూచించారు జడ్జి.
ఇదీ చూడండి: ఎస్ బ్యాంకు రానా కపూర్‌పై మరో సీబీఐ కేసు