కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో. ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. విధులకు ఆటంకం కలగకుండా వీలు ఉన్నవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఉద్యోగుల రక్షణ, ఆరోగ్యమే తమకు ముఖ్యమని పేర్కొంది విప్రో సంస్థ. కరోనా వైరస్ నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు కొద్ది వారాలుగా తగిన జాగ్రత్తలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
" ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి అవకాశం ఉన్నవారు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని సూచించాం. విప్రో కార్యాలయాలు తెరిచే ఉంటాయి. మా పర్యావరణ, ఆరోగ్య, రక్షణ, విపత్తు నిర్వహణ బృందం పరిస్థితులను అంచనా వేస్తూనే ఉంటుంది. వారం తర్వాత నివారణ చర్యలను సమీక్షించి భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలను బృందం నిర్ణయిస్తుంది."
- విప్రో.
మరిన్ని సంస్థలు
విప్రో మాదిరిగానే నోలారిటీ కమ్యూనికేషన్, హెల్త్ టెక్ స్టార్ట్అప్, నవ్య వంటి సంస్థలు సైతం ఇంటి నుంచే పని చేయాలని తమ ఉద్యోగులకు సూచించాయి.
డాట్ చర్యలు
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈనెల 12న కీలక మార్గదర్శకాలు జారీ చేసింది టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్). ఐటీ సంస్థల్లోని సుమారు 20 లక్షల మంది ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చూడాలని స్పష్టం చేసింది. కొన్ని సంస్థలకు ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది.
ఇదీ చూడండి: 'ఏజీఆర్ బకాయిల అసలు మొత్తం చెల్లించాం'