ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ఏజీఆర్ బకాయిల కింద సోమవారం మరో రూ.3,354 కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది. తాము అసలు మొత్తం కట్టేసినట్లేనని, ఇక వడ్డీ మాత్రమే కట్టాల్సి ఉందని ఆ కంపెనీ ప్రకటించడం గమనార్హం. తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు టెలికాం విభాగానికి వోడాఫోన్-ఐడియా రూ. 6,854 కోట్లు చెల్లించింది.
నిజానికి అసలు, వడ్డీ, జరిమానాలు కలిపి ఏజీఆర్ బకాయిల కింద వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.53,000 కోట్లు చెల్లించాలని టెలికాం విభాగం వెల్లడించింది. ఏజీఆర్ బకాయిలపై స్వీయ లెక్కింపు అంచనా వేసిన వొడాఫోన్ ఐడియా తాము కట్టాల్సిన మొత్తం రూ.21,553 కోట్లేనని మార్చి 6న వెల్లడించింది.
దీనిలో 2006-07 నుంచి 2018-19 కాలానికి అసలు రూ.6,854కోట్లు, మిగతాది వడ్డీ అని పేర్కొంది.
ఇదీ చూడండి: బీఎస్-6 అమ్మకాల్లో హోండా మైలురాయి