సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుతున్నారా..? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర యాప్‌లను వినియోగిస్తున్నారా..? అయితే.. ఇందులో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సాప్‌లో ఇదివరకే ఉన్న 'స్టేటస్' విభాగానికి మరిన్ని ఎంపికలను జోడించింది.
వాట్సాప్ స్టేటస్ ట్యాబ్‌లోనే.. 'షేర్ టూ ఫేస్బుక్ స్టోరీ', ' షేర్ టూ జీ-మెయిల్' ఇలా ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని ఎంచుకుంటే.. మీరు వాట్సాప్‌లో పంచుకునే 'స్టేటస్' ఫేస్బుక్, జీ-మెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి వాటిలోనూ స్టోరీలుగా, స్టేటస్‌లుగా కనిపిస్తాయి.
వాట్సాప్ స్టేటస్ పెడితే.. 24 గంటల వరకే కనిపిస్తోంది. ఆ తర్వాత దానికదే కనిపించకుండా పోతుంది. ఈ సదుపాయాన్ని ఫేస్బుక్కే చెందిన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నుంచి తీసుకుంది వాట్సాప్. ఇది కూడా ఫేస్బుక్లో భాగమే.
అయితే... కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ మీ స్థితిని తెలియజేయవచ్చు. అయితే.. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. బీటా యూజర్స్‌కు మాత్రమే ఈ సౌలభ్యం లభించనుంది.
మీ అనుమతితోనే...
ఈ సదుపాయాన్ని బలవంతంగా వినియోగదారులపై ప్రయోగించబోమని స్పష్టం చేసింది వాట్సాప్. దీనిపై వివరణ కూడా ఇచ్చుకుంది. కొత్త సదుపాయంతో.. ఫేస్బుక్, ఇతరత్రా యాప్‌లను వాట్సాప్‌కు కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని, బలవంతం ఏం లేదని ప్రకటించింది.
ఉదాహరణకు మీరు వాట్సాప్ స్టేటస్‌ను.. 'షేర్ టూ ఫేస్బుక్' ఆప్షన్ ఎంపిక చేసుకుంటే... ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్బుక్ యాప్ ఇన్స్టాల్ అయిఉంటే.. అందులోకి మళ్లుతుంది. మీ ఫోన్లో ఫేస్బుక్ యాప్ లేకుంటే మాత్రం.. డీఫాల్ట్ బ్రౌజర్‌కు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అప్పుడు వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు.
ఇతరత్రా ఏ యాప్‌లలోనైనా ఇదే విధానం అనుసరించాల్సి ఉంటుంది.