SC On Driving Licence Holders : లైట్ మోటర్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి 7,500 కిలోల బరువున్న రవాణా వాహనాన్ని నడపడానికి అర్హుడేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో వాణిజ్య వాహన డ్రైవర్లకు ఊరట లభించినట్లైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
'ఎలాంటి ఆధారాలు లేవు'
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్ పోర్టు వాహనాలను నడపడం కారణమని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రత అనేది తీవ్రమైన ప్రజా సమస్య అని, రోడ్డు ప్రమాదాల కారణంగా గతేడాది భారత్‌లోనూ 1.7 లక్షల మంది మరణించారని పేర్కొంది. 7,500 కిలోల కన్నా తక్కువ బరువున్న వాహనాలను నడపడానికి డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎలాంటి ఆమోదం అవసరం లేదని తెలిపింది.
"7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాన్ని నడుపుతున్న ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ దారులు బీమా క్లెయిమ్ చేసుకునేందుకు సుప్రీంతీర్పు సాయపడుతుంది. లైసెన్సింగ్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. మోటార్ వెహికల్ చట్టంలోని లోపాలను పరిష్కరించడానికి తగిన సవరణలు చేయాలి. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎల్ ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్టర్ల వల్లే జరిగాయని చెప్పలేం. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, మద్యం సేవించడం వంటివాటి వల్ల రోడ్డు ప్రమాదాలు జరగొచ్చు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇదీ కేసు!
ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి 7.5 టన్నుల బరువున్న రవాణా వాహనాన్ని నడపటానికి అర్హుడేనా? ఒకవేళ అలా నడుపుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బీమా చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కోరే హక్కు ఉంటుందా? అనే న్యాయవివాదంపై కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో తీర్పును సుప్రీంకోర్టు ఆగస్టు 21న రిజర్వ్ చేసింది. అంతకుముందు ధర్మాసనానికి ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, ఇతరులు తమ వాదనలు వినిపించారు. మోటారు వాహన చట్టం (ఎంవీఏ)-1988కి సవరణలు ప్రతిపాదించిన ముసాయిదా బిల్లు దాదాపు సిద్ధమైందని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టసభ సభ్యుల ఆమోదం పొందటానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెంకటరమణి తెలుపగా, ధర్మాసనం నోట్ చేసుకుంది. తాజాగా 7,500 కిలోల కన్నా తక్కువ బరువున్న రవాణా వాహనాలను ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు నడపొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.