Karthika Puranam Chapter 5 : కార్తిక మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ మాసంలో శివకేశవుల పూజతో పాటు కార్తిక పురాణం చదివినా, విన్నా ఆ పుణ్యం వెల కట్టలేనిది. కార్తిక పురాణంలోని 5వ అధ్యాయంలో ఉన్న కథలో భాగంగా కార్తీక పురాణం శ్రవణ మహత్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వశిష్ఠ జనకుల సంవాదం
వశిష్ఠుడు జనకునితో కార్తిక మాసంలో పురాణ శ్రవణ మహాత్యమును గురించి వివరిస్తూ "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ భగవద్గీత పారాయణం చేయవలెను. అటు తర్వాత మంచి ఉసిరి కాయలు గల చెట్లు గల వనములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి పూజించి, అటు పిమ్మట ఆ చెట్టు కిందనే బ్రాహ్మణులకు యధాశక్తి భోజనం పెట్టి, తాము కూడా అక్కడే భోజనం చేసి, పిదప కార్తిక పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేయవలెను. అట్లు చేసినచో ఉత్తమ గతులు కల్గును. ఈ విధంగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జన్మను పోగొట్టుకుని ఉత్తమ జన్మను పొందెను. ఆ కథను చెబుతాను వినుము" అని చెప్పసాగెను.
శివశర్మ కథ
పూర్వం కావేరి నదీ తీరంలో ఒక చిన్న గ్రామము కలదు. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అను పుత్రుడు కలదు. శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతి గారాబముతో పెరుగుట వలన చెడు సావాసాలు చేసి దురాచార పరుడై మెలుగు చుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి పిలిచి "కుమారా! నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకొనుచున్నారు. నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గు పడుచున్నాను. దీనికి ఒకటే మార్గం. రానున్న కార్తిక మాసంలో నీవు ప్రతి రోజు నదిలో స్నానం చేసి, శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ పోయి, నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును" అని హితవు పలికాడు.
కార్తిక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ
తండ్రి హితోక్తులు నచ్చని శివశర్మ కార్తిక స్నానమును, శివపూజను, దీపారాధనను, కార్తిక పురాణ శ్రవణమును చులకన చేసి మాట్లాడెను. కుమారుని ప్రవర్తనకి ఆగ్రహంతో దేవశర్మ "ఓరీ! నీచుడా! కార్తిక ఫలమును చులకన చేసి మాట్లాడుతున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో మూషికమై పడి ఉండు" అని శపించాడు. అంతట జ్ఞానోదయమైన శివశర్మ "ఓ తండ్రీ నన్ను క్షమింపుము. నాకు ఈ శాపం నుంచి విముక్తికి తరుణోపాయం చెప్పుము" అని తండ్రిని ప్రార్థించగా అప్పుడు దేవశర్మ "కుమారా! నా శాపమును అనుభవించుచూ, నీవు ఎప్పుడు కార్తిక మహత్యమును గురించి వింటావో అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది" అని తరుణోపాయం చెప్పాడు.
మూషిక రూపంలో చెట్టు తొర్రలో శివశర్మ నివాసం
ఆనాటి నుంచి శివశర్మ మూషికమై అడవిలో రావి చెట్టు తొర్రలో పడి ఉండేవాడు. ఆ అడవి కావేరి నది సమీపమునకు ఉండేది. ఎంతోమంది బాటసారులు, భక్తులు అక్కడకు వచ్చి, కావేరి నది స్నానమాచారించి, రావిచెట్టు కింద కూర్చుని పురాణం కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది.
విశ్వామిత్రుని ఆగమనం
ఇంతలో కార్తిక మాసంలో ఒకనాడు విశ్వామిత్రుడు కావేరి నది స్నానం కోసం తన శిష్యులతో కలిసి కావేరి నది తీరానికి చేరుకున్నాడు. ప్రయాణ బడలికతో ఉన్న ఆ మునిపుంగవుడు కావేరి నదీ స్నానం చేసి రావి చెట్టు కింద తన శిష్య గణముతో కలిసి పవిత్ర కావేరి నదీ తీరమున తన శిష్యులకు కార్తిక పురాణము వినిపించుచుండెను. అదే సమయంలో ఒక కిరాతుడు కూడా వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారని తలచి, వారి వద్ద ధనము దొరికితే తస్కరించాలన్న దుర్భుద్ధితో అక్కడకు చేరాడు. ఇంతలో శాపగ్రస్తుడైన మూషికం కూడా చెట్టు తొర్రలో నుంచి తొంగి చూచుచుండెను.
కార్తిక పురాణ శ్రవణ మహత్యం
అత్యంత మహిమాన్వితమైన కార్తిక పురాణ శ్రవణం వల్ల కిరాతుడుకి జ్ఞానోదయమై విశ్వామిత్రుడికి నమస్కరించి దొంగతనములు మానివేసి తన గ్రామమునకు పోయెను. అంతట ఆ మూషికమునకు కూడా పూర్వ జన్మ జ్ఞానము కలిగి తిరిగి బ్రాహ్మణ రూపమును పొంది "ఓ మునివర్యా! మీరు చెప్పిన కార్తిక పురాణ శ్రవణం వల్ల నేను ఈ మూషిక రూపం నుంచి విముక్తుడిని అయ్యాను" అని విశ్వామిత్రుల వారికి నమస్కరించి వెడలిపోయెను.
కాబట్టి "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో కార్తిక పురాణం చదివినను, విన్నను ఇహములో సకల సంపదలు కలిగి పరములో మోక్షమును పొందెదరు." అని వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తిక పురాణ మహాత్యమును తెలియజేసెను.
ఇతి స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే పంచమాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.