వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ల వినియోగం ఇటీవల బాగా పెరిగిన నేపథ్యంలో రిలయన్స్ జియో కూడా ఈ తరహా ఓ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ‘జియో మీట్’గా వ్యవహరించనున్న ఈ యాప్‌ను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంటు పంకజ్ పవార్ వెల్లడించారు.
"జియో మీట్ ప్లాట్‌ఫాంకు చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. ఎటువంటి డివైజ్, ఆపరేటింగ్ సిస్టమ్ పైనైనా ఇది పనిచేయగలదు. సహకార కార్యకలాపాల (కొలాబ్రేషన్) అవసరాలను కూడా ఇది సమర్థంగా తీరుస్తుంది. కేవలం సాధారణ వీడియో కాన్ఫరెన్స్ సేవలకే ఈ యాప్ పరిమితమవ్వదు"
- పంకజ్ పవార్, జియో ఇన్ఫోకామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
వివిధ ప్లాట్ ఫాంలతో అనుసంధానం..
జియోకు చెందిన ఇ-హెల్త్ ప్లాట్‌ఫాంను మీట్ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో వైద్యులతో సంప్రదింపులకు, ఔషధాల సిఫారసు చీటీని (ప్రిస్కిప్షన్) పొందేందుకు, మందులు ఆర్డరు చేసేందుకు, వైద్య పరీక్షలకు ఈ మీట్ యాప్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇ-హెడ్యుకేషన్ ఫ్లాట్‌పాం అనుసంధానంతో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణ, హోంవర్క్‌లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం, సొంతంగా విద్యార్థులు మల్టీమీడియాను నేర్చుకునే వెసులుబాటును కల్పించడం లాంటి సేవలకు కూడా జియో మీట్ ఉపయోగపడనుంది.
కొవిడ్-19 పరిణామాలు, లాక్‌డౌన్ ఆంక్షలు నేపథ్యంలో ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు, సమావేశాల నిర్వహణకు వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మైక్రోసాప్ట్‌కు చెందిన టీమ్స్ యాప్, జూమ్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఆయా కంపెనీలు వెల్లడించడం గమనార్హం.