కొత్త యాప్‌లు తీసుకురావడంలో గూగుల్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. అన్ని రకాల అవసరాలకు తగ్గట్లు యాప్‌లు తీసుకురావడం గూగుల్ ప్రత్యేకత. అయితే కొత్తవి తీసుకురావడమే కాదు.. ఆదరణ లేని వాటిని తొలగించడమూ ముఖ్యమేనని నమ్ముతుంది గూగుల్. ఇంతకీ గూగుల్ సేవలు నిలిపివేసిన 10 యాప్‌లు ఏంటో తెలుసుకుందాం..
గూగుల్ ప్లస్
భూత.. వర్తమాన.. భవిష్యత్ అనే నినాదంతో వచ్చిన గూగుల్‌ప్లస్‌కు.. భవిష్యత్ లేకుండా చేసింది కూడా ఈ ఏడాదే. సోషల్ వెబ్‌సైట్‌లో గూగుల్ ప్లస్ ఎనిమిదేళ్ల క్రితం మొదలైంది.
ఇన్‌బాక్స్
‘జీ-మెయిల్ వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తాం.. అంటూ నాలుగేళ్ల క్రితం వచ్చింది ఇన్‌బాక్స్. గూగుల్ ఈ ఏడాది దాన్ని మూసేసి ఆ ఫీచర్లను జీ-మెయిల్‌లో కలిపేసింది.
గూగుల్ ఆలో
వాట్సాప్‌కు పోటీ అని గూగుల్ చెప్పకపోయినా.. ఆ స్టైల్ ఫీచర్లతో ‘ఆలో’ను తీసుకొచ్చింది గూగుల్. అయితే దాన్ని రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు నడపలేకపోయింది. ఇటీవల సర్వీసును నిలిపేసింది. ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
క్రోమ్ కాస్ట్ ఆడియో
ఏ డివైజ్ నుంచైనా స్పీకర్‌కు మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేయగలిగేలా మూడేళ్ల క్రితం ‘క్రోమ్ కాస్ట్ ఆడియో’ను గూగుల్ తీసుకొచ్చింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది దానిని మూసేసింది.
యూఆర్‌ఎల్ షార్టనర్
గూగుల్ తీసుకొచ్చిన అత్యంత పాత సర్వీసుల్లో యూఆర్‌ఎల్ షార్టనర్ ఒకటి. పొడవాటి యూఆర్‌ఎల్‌ను షార్ట్ చేసి అందించే సర్వీసు అది. తొమ్మిదేళ్ల నాటి ఈ సర్వీసును గూగుల్ ఈ ఏడాది మూసేసింది.
ఏరియో
రెస్టరెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే సర్వీసులు అంటే స్విగ్గీ, జొమాటో గుర్తొస్తాయి. కానీ గూగుల్ ‘ఏరియో’ పేరుతో ఓ యాప్ తీసుకొచ్చింది. కానీ, ఈ ఏడాది దానినీ మూసేసింది. అయితే ఈ యాప్ చాలా తక్కువ ప్రాంతాల్లోనే సర్వీసు అందించింది.
యూట్యూబ్ గేమింగ్
గేమ్స్ అంటే బాగా ఇష్టపడేవారి కోసం నాలుగేళ్ల క్రితం ‘యూట్యూబ్ గేమింగ్’ పేరుతో గూగుల్ ఓ సర్వీసును తీసుకొచ్చింది. ఇందులో గేమింగ్ వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది దీనినీ మూసేశారు.
యూట్యూబ్ మెసేజెస్
యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చితే దానిని ఇతరులకు వాట్సాప్ చేస్తుంటారు. కానీ, ఒకప్పుడు యూట్యూబ్‌లోనే పంపే ఆప్షన్ ఉండేది. రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో మెసేజెస్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇది కుదిరేది. ఇప్పుడు ఆ సర్వీసును యూట్యూబ్ నిలిపేసింది.
గూగుల్ ట్రిప్స్
విహార యాత్రలకు వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉండేలా గూగుల్ మూడేళ్ల క్రితం ‘ట్రిప్స్’ అనే యాప్ తీసుకొచ్చింది. మీరు పర్యటనకు వెళ్తున్న ప్రాంతం పేరుతో సెర్చ్ చేస్తే అక్కడి ప్రముఖ ప్రదేశాలు, రెస్టరెంట్ల విశేషాలన్నీ అందులో దొరికేవి. కానీ ఈ యాప్ సేవలను గూగుల్ ఈ ఏడాది నిలిపేసింది.
క్రోమ్ డేటా సేవర్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వినియోగించేటప్పుడు తక్కువ డేటా ఖర్చయ్యేలా ఓ ఎక్స్‌టెన్షన్ ఉండేది. ఈ సర్వీసు ద్వారా ఎంత మొబైల్ డేటా /వైఫైని సేవ్ చేశారనేది కనిపించేది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఈ ఏడాది గూగుల్ నిలిపేసింది.
ఇదీ చూడండి: చైనా దెబ్బకు ఆ యాప్‌ను తొలగించిన యాపిల్