గత నెలలో రిజర్వ్ బ్యాంకు, ఇప్పుడు ఒకరోజు తేడాలో కేంద్ర గణాంక సంస్థ ప్రపంచబ్యాంకు నోట వెలువడింది... ఒకే మాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అయిదు శాతానికి పరిమితం కానున్నదని వాటి అంచనా. ఆరు నెలల క్రితం ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృధ్ధి చెందుతున్నది ఇండియాయేనని ఘనంగా చాటిన ఆర్థిక సర్వే, ఈ ఏడాది వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదని ఢంకా బజాయించింది. దానితో పోలిస్తే తాజా అంచనాల్లో రెండుశాతం నికర తగ్గుదల, పదకొండేళ్ల కనిష్ఠస్థాయిని సూచిస్తోంది. గనులు, రక్షణ వంటివి స్వల్ప మెరుగుదల నమోదు చేసినా- విద్యుత్, సహజవాయు, వ్యవసాయ, నిర్మాణ రంగాలు పడకేసిన తీరు ఆందోళన పరుస్తోంది. ఏడాది కాలంలో దారుణంగా చతికిలపాటుకు గురైంది తయారీరంగం. నిరుడు 6.2 శాతం మేర నమోదైన తయారీ రంగ వృద్ధి ఈ ఏడాది కేవలం రెండు శాతానికి పరిమితం కానుందన్నది గణాంక సంస్థ ముందస్తు అంచనా. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని విస్మరించి ప్రస్తుత విపణి ధరల ప్రకారం వస్తుసేవల్ని లెక్కకట్టే నామమాత్ర జీడీపీ నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయిందంటున్న గణాంక విశ్లేషణ, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పన్ను రాబడిలో భారీ కుంగుదల, ద్రవ్యలోటు విజృంభణ ఈసరికే కళ్లకు కడుతున్నాయి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తిలో 3.3 శాతానికి ద్రవ్యలోటు కట్టడి కావాలన్నది ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం. పన్ను వసూళ్లలో పెరుగుదల ఎండమావిని తలపిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణా ఆశించినంతగా ఉండబోదన్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో పరిస్థితి కొంత తేటపడి, ప్రథమార్ధంకన్నా వృద్ధి రేటు ఎంతోకొంత పుంజుకొంటుందని కేంద్ర గణాంక సంస్థ ఆశావహంగా స్పందించినా- అటువంటి సూచనలేవీ మచ్చుకైనా కానరావడంలేదు. విస్తృత సంప్రతింపులతో తమ వంతుగా ప్రయత్నలోపం లేకుండా కాచుకోవాలన్న పాలకశ్రేణి పట్టుదల, పరిస్థితిలో ఏ మేరకు మార్పు తేగలదో చూడాలి.
హాంకాంగ్, సింగపూర్ సహా పదహారు ఆసియా దేశాల్ని ఆర్థికమాంద్యం ఆవరిస్తోందని సుమారు ఇరవై వారాల క్రితం హెచ్చరించిన మూడీస్ సంస్థ, భారత వృద్ధిరేటు అంచనాల్నీ అప్పట్లో తెగ్గోసింది. అయినా నెల్లాళ్లక్రితం వరకు ‘దేశంలో ఆర్థిక మాంద్యం లేదు... రాబోదు!’ అన్న ధోరణే కేంద్ర విత్తమంత్రిత్వశాఖలో గోచరించింది. డిసెంబరు ఆఖరి వారంలో ‘ముంచుకొస్తున్న మందగమన గండం గడచి గట్టెక్కడానికి సత్వర చర్యలు చేపట్టండి’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించిన దరిమిలా, కేంద్రం వైఖరి మారింది. ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పించనున్న కేంద్రబడ్జెట్ రూపకల్పనకు ఉపకరించేలా జనబాహుళ్యం నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించిన ప్రధాని మోదీ- బృందాల వారీగా పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు! ద్రవ్యలోటు నోరావలించకుండా నియంత్రించడానికి ప్రభుత్వ వ్యయంలో రెండు లక్షల కోట్ల రూపాయల దాకా తెగ్గోత తప్పదన్న సూచనలు ఇప్పటికే వినవస్తున్నాయి. బ్యాంకింగేతర సంస్థల్లో రుణాల మంజూరు కోసం అమలుపరుస్తున్న కఠినతర నిబంధనలు, వినియోగంలో క్షీణత వంటివి వృద్ధిరేటును దిగలాగుతున్న యథార్థాన్ని ప్రపంచబ్యాంకు సూటిగా ప్రస్తావించింది. కొన్ని ప్రాథమిక అంశాలను ప్రభుత్వం స్పృశించినా, ఇప్పటికీ ఇండియా ముంగిట పలు సవాళ్లు నిలిచి ఉన్నాయని ఐఎంఎఫ్ లోగడే స్పష్టీకరించింది. అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో మూడేళ్ల వ్యవధిలోనే భారత్ దాదాపు ముప్ఫై స్థానాలు పడిపోయింది. సృజన సామర్థ్యంలో మెరుగ్గా ఉన్నప్పటికీ సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, నైపుణ్యాలు, కార్మిక విపణి, ఆరోగ్యపద్దు తదితరాలకు సంబంధించి వెనకబాటుతనం దేశాన్ని కుంగదీస్తున్నదని ఆ మధ్య ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) చెప్పింది అక్షర సత్యం. పూడ్చాల్సిన కంతలేమిటన్న సమగ్ర అవగాహనతో రేపటి బడ్జెట్‌లో సరైన దిద్దుబాటు చర్యలకు కేంద్రం చోటుపెడితేనే దేశార్థికం తేరుకుంటుంది.
వృద్ధి అన్నది ఆకాశంలోంచి ఊడిపడదు. సుమారు రెండున్నరేళ్ల క్రితం ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్ సుబ్రమణియన్ ‘ఉపాధి రహిత వృద్ధి’పై ఆందోళన వ్యక్తపరచినా, దీటైన కార్యాచరణ పట్టాలకు ఎక్కలేదు. ఉపాధి కల్పన ఊపందుకోకుండా ఏడుశాతం వృద్ధి ఎలా సాధ్యమని రిజర్వ్ బ్యాంకు మాజీ సారథి రఘురాం రాజన్ నిరుడు సహేతుక ప్రశ్న లేవనెత్తారు. భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా), డిజిటల్ ఇండియా, నైపుణ్య భారత్ వంటి పథకాలు ప్రవేశపెట్టినా- ఉపాధి అవకాశాల పెంపుదల మరీచికను తలపించడానికి కారణాలేమిటో ప్రభుత్వం ఇకనైనా లోతుగా సమీక్షించాలి. తయారీ రంగంలో ఒక ఉద్యోగం నాలుగు పరోక్ష ఉపాధి అవకాశాల్ని సృష్టించే వీలున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితి దిమ్మెరపరుస్తోంది. నిరుడు 8.7 శాతం మేర విస్తరించిన నిర్మాణ రంగం వృద్ధి ఈ ఏడాది 3.2 శాతానికి కుంగిపోయింది. ఆటొమొబైల్ రంగానిదీ అటువంటి దీనగాథే. వాటి గోడు ఆలకించడం సహా గ్రామీణ పరిశ్రమలు, విద్య, ఐటీ రంగాల్ని పరిపుష్టీకరించి సేద్యానికి జవసత్వాలు సమకూరిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మాంద్యం తాలూకు దుష్ప్రభావాలకు అదే సరైన విరుగుడు. ఎం.ఎస్.స్వామినాథన్ మేలిమి సిఫార్సులు, ప్రత్యక్ష పన్ను సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి యోజనలను చురుగ్గా అమలుపరచడమే ప్రస్తుత ఆర్థిక క్లేశాల నుంచి దేశానికి ఉపశమనం కలిగించగల ఉత్తమ పరిష్కారం. పశ్చిమాసియాలో యుద్ధభయం నేపథ్యంలో, మాంద్యం కొనసాగే ముప్పు కొట్టిపారేయలేనిది. ఇటువంటప్పుడు సేద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో అత్యవసర ప్రాతిపదికన విధాన క్షాళనే సంక్షుభిత దేశార్థికాన్ని సాంత్వనపరచే వృద్ధిమంత్రం కాగలుగుతుంది!
ఇదీ చూడండి:టాటా, మిస్త్రీ వివాదంపై నేడే సుప్రీం విచారణ