దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. సంస్థ షేరు ధర సోమవారం 6 శాతానికిపైగా పుంజుకుని రికార్డు స్థాయిని తాకిన క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మార్కెట్ విలువ పరంగా రూ.10 లక్షల కోట్లు దాటిన రెండో సంస్థగా నిలిచింది.
ఈ వారాంతంలో సంస్థ బోర్డు సమావేశం, షేర్ బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలన నేపథ్యంలో సోమవారం ఆరంభ ట్రేడింగ్లో సంస్థ షేరు ఏకంగా 6 శాతానికిపైగా వృద్ధి చెందింది. షేర్ల దూకుడుతో కంపెనీ మార్కెట్ విలువ రూ.10,03,012.43 కోట్లకు చేరింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిలో షేరు ధర 6.18 శాతం పెరిగి రూ.2,678.80కి వృద్ధి చెందింది. అలాగే.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజిలో జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. 6.16 శాతం వృద్ధితో రూ.2,679కు చేరింది.
నెల రోజుల వ్యవధిలోనే టీసీఎస్ ఎం-క్యాప్ విలువ లక్ష కోట్లపైగా పెరిగింది. గత నెలలో రిలయన్స్ తర్వాత రూ.9 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది టీసీఎస్. తొలిస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ విలువ ప్రస్తుతం 15,02,355.71 కోట్లుగా ఉంది.
ఆదివారం రాత్రి రెగ్యులేటర్ ఫైలింగ్ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది టీసీఎస్. సంస్థకు చెందిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను అక్టోబర్ 7 జరిగే బోర్డు సమావేశంలో డైరెక్టర్లు పరిశీలించనున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి ఇతర విషయాలు వెల్లడించలేదు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్పైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మదుపరులు టీసీఎస్ షేర్ల కొనుగోలుకు ఎగబడ్డారు.
2018లో రూ. 16వేల కోట్లు విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసింది.
ఇదీ చూండండి: రిలయన్స్ ఎం-క్యాప్ @ రూ.14 లక్షల కోట్లు