స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కొన్న సూచీలు.. కొద్ది సేపటికే తేరుకున్నాయి. ఆ తర్వాత సెషన్ మొత్తం లాభాల జోరును కొనసాగించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 489 పాయింట్లు బలపడింది. చివరకు 39,602 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 11,832 వద్ద ముగిసింది.
ఫెడ్ నిర్ణయంతో ఊతం
ప్రస్తుతానికి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ అమెరికా ఫెడ్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే వృద్ధికి ఊతమందించే దిశగా త్వరలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి.
వచ్చే వారం జరగనున్న అమెరికా-చైనా అధ్యక్షుల భేటీపై సానుకూల అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.
వీటికి తోడు రూపాయి క్రమంగా బలపడుతుండటం లాభాలకు మరో కారణం.
ఇంట్రాడే సాగిందిలా
ఒడుదొడుకుల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిసేపటికే తేరుకుంది. సెషన్ మొత్తం 38,934-39,639 పాయింట్ల మధ్య సూచీ కదలాడింది.
నిఫ్టీ 11,843 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,635 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.
లాభనష్టాల్లోనివివే..
యెస్ బ్యాంకు అత్యధికంగా 10.94 శాతం లాభపడింది. సన్‌ఫార్మా 4.01 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.80 శాతం, ఎల్&టీ 3.36 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.20 శాతం, మారుతి 3.17 శాతం, బజాజ్ ఆటో 3.08 శాతం లాభపడ్డాయి.
హెచ్‌యూఎల్ 0.26 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.16 శాతం, ఐటీసీ 0.07 శాతం, ఎన్టీపీసీ 0.04 శాతం నష్టపోయాయి.
జెట్ షేర్లు 93 శాతం వృద్ధి
13 సెషన్లలో 90 శాతం నష్టపోయిన జెట్ షేర్లు.. నేడు ఏకంగా 93 శాతం పుంజుకున్నాయి. బీఎస్ఈలో షేరు ధర రూ.64కు చేరింది.
రూపాయి, ముడి చమురు
రూపాయి నేటి ట్రేడింగ్‌లో 11 పైసలు బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.57కు చేరింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 2.67 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 63.47 డాలర్లుగా ఉంది.
ఇతర మార్కెట్లు ఇలా...
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్, షాంఘై సూచీ, సియోల్ సూచీ-కోస్పీ, జపాన్ సూచీ నిక్కీలు సానుకూలంగా ముగిశాయి.
ఇదీ చూడండి: అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్