ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, విద్యుత్ రంగ షేర్ల ప్రోత్సాహంతో స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 194 పాయింట్లు పుంజుకుంది. ప్రస్తుతం 39,696 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,907 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
విశ్లేషణ
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్&ఓ) మే నెల కాంట్రాక్టుల ముగింపు దగ్గర పడుతున్నందున మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
"కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మదుపరులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లాభాల సీజన్ దాదాపుగా ముగిసింది. వచ్చే నెలలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం. పూర్తి బడ్జెట్లో ప్రకటించే వృద్ధి ప్రణాళికలు ఇక ముందు లాభాలకు దోహదం చేసే అంశాలు." - నరేంద్ర సోలంకి, స్టాక్‌మార్కెట్ నిపుణుడు
లాభనష్టాల్లోనివివే..
ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఎస్ బ్యాంకు, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎం & ఎం, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 8 పైసలు లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.31 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 68.08 డాలర్లకు చేరింది.
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు చైనా సూచీ, జపాన్ సూచీ- నిక్కీ, దక్షిణ కొరియా సూచీ- కోస్పీలు నష్టాలతో నేటి సెషన్‌ను ప్రారంభించాయి.
ఇదీ చూడండి: రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం!