స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు నేటి నష్టాలకు ప్రధాన కారణం. సంక్షోభం నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి ఉద్దీపనలు ఉంటాయనే ఆశతో వాహన రంగం కాస్త సానుకూలంగా స్పందించినా.. టాటా మోటార్స్ మాత్రం భారీ నష్టాన్ని నమోదు చేసింది. వృద్ధి మందగమనం, ఆర్థిక మాంద్యం అంచనాలు, అమెరికా-చైనా వాణిజ్య భయాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 268 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,060 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 10,919 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,406 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,022 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,034 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,907 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హీరో మోటార్స్ 1.78 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, హెచ్‌యూఎల్ 0.70 శాతం, బజాజ్ ఆటో 0.69 శాతం, మారుతీ 0.39 శాతం లాభాలను నమోదు చేశాయి.
టాటా మోటార్స్ అత్యధికంగా 9.29 శాతం నష్టపోయింది. 8.21 నష్టంతో ఎస్ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉంది. సీజీ పవర్‌కు ఇచ్చిన రుణాలపై నెలకొన్న సందిగ్ధతలే ఎస్ బ్యాంక్ నష్టాలకు ప్రధాన కారణం.
టాటా స్టీల్ 4.26 శాతం, ఓఎన్జీసీ 3.12 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.77 శాతం, ఎల్&టీ 2.41 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఫేస్బుక్లో కొత్త ఫీచర్... సమాచారం మరింత భద్రం