స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ప్రారంభం నుంచే ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి సూచీలు. 35 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించినప్పటికీ.. జీడీపీ అంచనాలను తగ్గిస్తూ ఆర్బీఐ చేసిన ప్రకటనతో మదుపరుల సెంటిమెంట్ ప్రభావితమైంది. ఈ కారణంగా భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయింది. చివరకు 36,690 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 10,855 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,104 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 36,611 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 10,975 పాయింట్ల అత్యధిక స్థాయి... 10,836 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్యూఎల్ 1.95 శాతం, ఎస్ బ్యాంకు 1.70 శాతం, హీరో మోటార్స్ 1.54 శాతం, సన్ ఫార్మా 0.80 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఎం&ఎం 5.62 శాతం, టాటా స్టీల్ 4.75 శాతం, టాటా మోటార్స్ 4.20 శాతం, ఎస్బీఐ 3.75 శాతం, వేదాంత 3.02 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.77 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఏడాది కనిష్ఠానికి ఎస్బీఐ వడ్డీ రేట్లు