స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లోని పలు షేర్లు సానుకూలంగా ట్రేడవుతూ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం మార్కెట్లకు కలిసివస్తున్న అంశమని నిపుణులు చెబుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 148 పాయింట్లకు పైగా వృద్ధితో.. ప్రస్తుతం 41,264 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 41 పాయింట్లకు పైగా లాభంతో..12,148 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
2019-20 మూడో త్రైమాసికంలో ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్‌లు మంచి లాభాలను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల షేర్లు నేడు భారీగా పుంజుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇతర మార్కెట్లు..
చైనాను భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చనే ఆందోళనలతో ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ దాదాపుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి, ముడి చమురు..
రూపాయి నేడు స్వల్పంగా క్షీణించి డాలర్‌తో మారకం విలువ ప్రస్తుతం 71.21 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 1.33 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 62.37 డాలర్ల వద్ద ఉంది.