ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేసింది. 2019 సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత నికరలాభం ఆరింతలు వృద్ధి చెంది రూ. 3,375.40 కోట్లను ఆర్జించింది. బ్యాంకు నికర లాభం రూ. 576.46 కోట్లుగా ఉంది.
ఇదే సమయంలో ఎస్బీఐ గ్రూపు పూర్తి ఆదాయం రూ.89,347.91 కోట్లకు పెరిగింది. 2018-19 రెండో త్రైమాసికంలో ఎస్బీఐ ఆదాయం రూ.79,302.72 కోట్లుగా ఉంది.
2019-20 రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు 7.19 శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలు 2.79 శాతానికి తగ్గినట్లు ఎస్బీఐ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు నిరర్ధక ఆస్తులు 9.95 శాతంగా, నికర నిరర్ధక ఆస్తులు 4.84 శాతంగా ఉన్నాయి.
భారీ లాభాల ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేరు విలువ 7 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం ఒక షేరు విలువ రూ. 281 దాటింది.