టేప్‌వార్మ్ వ్యాధి చికిత్సలో వాడే నిక్లోసమైడ్(Niclosamide) ఔషధాన్ని కరోనా రోగులకు ఉపయోగించేందుకు అనుమతించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)కు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం.. నియంత్రణ సంస్థలను కోరింది. ఈ విషయాన్ని రిలయన్స్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉందా, లేదంటే సంస్థ నడిపే ఆస్పత్రుల్లో వినియోగం కోసమే అనుమతులు కోరిందా అనే విషయంపై రిలయన్స్ స్పష్టత ఇవ్వలేదు.
రిలయన్స్(Reliance) ప్రతిపాదనపై ఔషధ నియంత్రణ సంస్థలు సమీక్షించి, తుది అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నాయి. వయోజనుల్లో నిక్లోసమైడ్ ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ప్రభుత్వం ఇదివరకే పచ్చజెండా ఊపింది.
నిక్లోసమైడ్ను గత 50 ఏళ్లుగా టేప్‌వార్మ్(ఒక విధమైన ఏలికపురుగు) వల్ల తలెత్తే వ్యాధికి చికిత్సగా ఉపయోగిస్తున్నారు. డబ్ల్యుహెచ్ఓ అత్యవసర ఔషధాల జాబితాలోనూ దీనికి స్థానం ఉంది. 2003-04 సంవత్సరాల్లో సార్స్(SARS) వైరస్ సోకిన బాధితులకు దీన్ని అందించారు.
శాస్త్రీయ పరిశోధనలు
మరోవైపు ఇతర శాస్త్రీయ అంశాలపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్)తో రిలయన్స్ పనిచేస్తోందని సంస్థ తెలిపింది. వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియాలోని లిపిడ్ లేయర్‌ను నాశనం చేసే నెక్సార్ పాలీమర్పై సీఎస్ఐఆర్తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా శానిటైజర్ల తయారీ ప్రక్రియను అభివృద్ధి చేసినట్లు వివరించింది.
వెంటిలేటర్ల కొరతను నివారించేలా ఇటలీలో అభివృద్ధి చేసిన విధానాన్ని ఉపయోగించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. సీపీఏపీ యంత్రం, త్రీడీ ప్రింట్ చేసిన షార్లెట్ వాల్వ్, ప్రత్యేక మాస్కుతో ఈ వెంటిలేటర్ పనిచేస్తుందని వెల్లడించింది. మరోవైపు, 90-95 శాతం స్వచ్ఛతతో నిమిషానికి 5-7 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించింది.
ప్రపంచంలోని ఉత్తమ సంస్థలకు చెందిన 900 మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు రిలయన్స్‌తో పనిచేస్తున్నారని వార్షిక నివేదికలో వెల్లడించింది. దేశంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి- ఉద్యోగులకు రిలయన్స్ ఆపన్న హస్తం