కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో వ్యాపార సంస్థలు వ్యయాలు తగ్గించుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇందుకోసం సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనాల కోతకు సిద్ధమవుతున్నాయి. చిన్న సంస్థలు మొదలుకుని దిగ్గజాల వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరింది. దేశంలో అతిపెద్ద సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ఉద్యోగుల్లో చాలా మందికి 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించనున్నట్లు తెలిపింది. సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆయన పారితోషికం మొత్తం వదులుకోనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ముకేశ్ అంబానీకి ఏడాదికి పారితోషికం కింద రూ.15 కోట్ల వరకు వస్తుంది.
వేతనాల కోతలు ఇలా..
సంస్థ ఉద్యోగుల్లో రూ.15 లక్షల వార్షిక వేతనం కన్నా తక్కువ ఉన్నవారికి ఎలాంటి కోతలు ఉండవని రిలయన్స్ హామీ ఇచ్చింది. అంతకన్నా ఎక్కువ సంపాదించే వారికి మాత్రం 10 శాతం కోత విధించనున్నట్లు తెలిపింది.
బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)సభ్యులు, సీనియర్ లీడర్లకు 30 నుంచి 50 శాతం వరకు కోత విధించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:స్పైస్‌జెట్ ఉద్యోగులకు ఏప్రిల్ వేతనంలో కొంత చెల్లింపు